Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్ర విచారణ జరిపించాలి-సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్‌లోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై కాంట్రాక్టర్లు పోలీసుల ద్వారా దాడి చేయించారు. కార్మికులు వేతనాలు, బోనస్ ఇవ్వాలని కోరడాన్ని జీర్ణించుకోలేని కాంట్రాక్టర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఘటనలో పలువురు కార్మికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. కొందరు క్యాంపు శిబిరాల్లోనే చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బీ మధు నేతృత్వంలోని బృందం పరామర్శించింది. వారి పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే...మంచిర్యాల జిల్లా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మందమర్రి ఏరియా కల్యాణఖని ఓపెన్‌కాస్ట్‌లో ఓవర్ బటన్ తొలగింపు పనులను ఆర్.వి. ఆర్.ఓ బి యాజమాన్యం నిర్వహిస్తున్నది. ఈ పనుల కోసం మధ్యప్రదేశ్, బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 400 మంది వలస కార్మికులను తీసుకొచ్చి చట్ట విరుద్ధంగా క్యాంపులను నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి వలస కార్మికులు తమ వేతనాలు, బోనస్‌లు ఇవ్వాలని ఆర్వీఆర్ యాజమాన్యాన్ని కోరారు. ఇది సహించలేని యాజమాన్యం వారిపై దాడి చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను పిలిపించి మరోసారి దాడి చేయించారు. తెలుగు, హిందీ కార్మికులను వేరుచేసి, హిందీ కార్మికులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. క్షతగాత్రుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం సిది, సింగ్రోలి జిల్లాకు చెందిన ముగ్గురు కార్మికులు బజరంగల్ కెవట్, బ్రిజేష్ కుమార్ కేవట్, దుర్గాప్రసాద్ కేవట్ల పరిస్థితి సీరియస్ కావడంతో మంచిర్యాలలోని మెడిలైఫ్ హాస్పటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి విషయం తెలిసిన వెంటనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (ఎస్సీకేఎస్-సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం రేషన్ కార్యదర్శి దూలం శ్రీనివాస్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను, క్యాంపుల్లో గాయాలపాలైన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా బీ మధు మాట్లాడుతూ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.