Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మెన్ సోమ భరత్‌కుమార్
నవతెలంగాణ-ఓయూ
అవకతవకలకు ఆస్కారం లేకుండా విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారులకు పారదర్శకంగా సేవలందించేందుకు ''విజయ పాల మిత్ర'' మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తున్నామని పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మెన్ సోమ భరత్‌కుమార్ అన్నారు. హైదరాబాద్ లాలాపేట్‌లోని విజయ డెయిరీ కార్యాలయంలో శనివారం విజయ డెయిరీ ఎండీ అధర్ సిన్హా, అధికారులతో కలిసి ఆయన మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..16 మిల్క్ షెడ్లలో 5,250 సహకార సంఘాల సహకారంతో 1,43,200 మంది పాడి రైతుల నుంచి నిత్యం పాలసేకరణ జరుగుతున్నదన్నారు. ఈ మొబైల్ యాప్ ద్వారా ఓ రైతు నిత్యం ఎంత పాలు విజయ డెయిరీకి పోస్తున్నారు, దానిలో ఉన్న ఫ్యాట్ శాతం ఎంత, వారికి ఎంత డబ్బు అకౌంట్లో జమవుతుందన్న విషయాన్ని రైతు తన ఫోన్లో ఎప్పటికప్పుడూ తెలుసుకోవచ్చన్నారు. పాడి రైతులకు 15 రోజులకు ఒకసారి రెమ్యునరేషన్ జమవుతాయని.. రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులు ఎక్కడ ఎంత పాలు పోస్తున్నారని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పారు. రైతుల్లో విజయ డెయిరీపై విశ్వాసం పెంచడానికి ఈ యాప్‌ను ప్రారంభించామన్నారు. విజయ డెయిరీ పాల ఉత్పత్తులు పెంచడం, పాడి రైతుల కోసం త్వరలో పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ద్వారా ఆవులు, గేదెలు కొనేందుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఈ యాప్‌ను పైలట్ ప్రాజెక్టు కింద మొదట రంగారెడ్డి, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ప్రారంభించామని, అక్కడ విజయవంతమయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. నమ్మకాన్ని పెంపొందించుకొని ఎక్కువ గ్రామాల్లో డెయిరీ సేవలు విస్తరిస్తామన్నారు. కార్యక్రమంలో పీ అండ్ఐ జీఎం ఎడ్ల మల్లయ్య, ఎంపీఎఫ్ జీఎం కామేష్, మార్కెటింగ్ జీఎం వి.మల్లికార్జున్‌రావు, మార్కెటింగ్ ఆర్యస్యం కె.అరుణ్ కుమార్, శ్రవణ్ కుమార్, ఎస్ఈ దేవేందర్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.