Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ 26న వికలాంగుల బహిరంగ సభ
- ఎన్పీఆర్డీ జాతీయ సహాయ కార్యదర్శి ఎం అడివయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల సంక్షేమం, హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు ఉదతం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) అఖిల భారత సహాయ కార్యదర్శి ఎం అడివయ్య తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ అధ్యక్షతన రాష్ట్ర కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26నుంచి 28 వరకు హైదరాబాదులో ఎన్పీఆర్డీ అఖిలభారత మూడవ మహాసభలు మొదటిసారిగా నిర్వహిస్తు న్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. వికలాంగుల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో వారి పట్ల మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వికలాంగుల హక్కుల
కోసం, వారి సంక్షేమం కోసం పోరాడి సాధించుకున్న చట్టాలను మారుస్తున్నదని తెలిపారు. విద్యా, ఉద్యోగాల్లో వికలాంగులకు మోడీ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటు పరం చేయడం ద్వారా వికలాంగులు రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వికలాంగుల కోసం ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూషన్స్ను మూసివేయడానికి కుట్రలు చేస్తుందని విమర్శించారు.
26న ఇందిరా పార్క్ దగ్గర బహిరంగ సభ
మహాసభల సందర్భంగా ఈ నెల 26న ఇందిరాపార్క్ దగ్గర వికలాంగుల బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ముఖ్య అతిథిగా పశ్చిమబెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి జి కాంతి గంగులీ హాజరవుతున్నారనీ, ఎన్పీఆర్డీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి మురళీధరన్, ప్రముఖ విద్యావేత్త పి ఉమర్ ఖాన్, కేంద్ర కమిటి సభ్యులు ఎం జనార్దన్ రెడ్డి, సిహెచ్ సాయమ్మ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ పాల్గొంటున్నారని తెలిపారు.
27న వికలాంగుల సాధికారతపై జాతీయ సదస్సు
ఈ నెల 27న వికలాంగుల సంక్షేమం, సాధికారతపై డాక్టర్ భారతీరావు రిహాబిలిటేషన్ సెంటర్ దేశ్ముఖ్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మైనార్టీ, వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కేరళ సోషల్ జస్టిస్ మినిస్టర్ డాక్టర్ ఆర్ బిందు, తెలంగాణ వికలాంగుల కోపరేటివ్ కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కె.వాసుదేవ రెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి శైలజ, హెలెన్ కేల్లర్ విద్యాసంస్థల చైర్మెన్ ఉమ్మర్ ఖాన్, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల చైర్మెన్ కె వి కె రావు , టీఏఎస్ఎల్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమద్ ఖాన్, యూనివర్సల్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ ఆడియాలజిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె నాగేందర్, ప్రముఖ శాస్త్రవేత్త పి జనీల హాజరవుతున్నారని తెలిపారు.సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జెర్కొని రాజు, బిట్ల గణేష్, టి మధుబాబు, సహాయ కార్యదర్శి ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు శశికళ, రంగారెడ్డి, చంద్రమోహన్, బొల్లెపల్లిస్వామి, లలిత, జంగయ్య, చంద్రమోహన్, రామకృష్ణ, భుజంగ రెడ్డి, రాజశేఖర్ గౌడ్, సురేందర్, షహీన్ బేగం తదితరులు పాల్గొన్నారు