Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందమర్రిలో ఆరుగురి సజీవ దహనం
- అర్ధరాత్రి ఇంటికి నిప్పంటుకున్న వైనం
- చుట్టపు చూపుగా వచ్చిన తల్లీపిల్లలు మృతి
- వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు
- ఆ ఇంటి సమీపంలో పెట్రోల్ డబ్బాలు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటికి నిప్పంటుకొని ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాసు శివయ్య ఇంటికి నిప్పంటుకొని గాఢ నిద్రలో ఉన్న ఆరుగురు మృతిచెందారు. వారి ఆర్తనాదాలు విని ఇరుగుపొరుగు అప్రమత్తమయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖతోపాటు పోలీసులకు సమాచారం అందజేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేలోపు ఘోరం జరిగిపోయింది. పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రమోద్‌రావు ఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నవతెలంగాణ- మంచిర్యాల, నస్పూర్, కాసిపేట
మాసు శివయ్య - భార్య పద్మ ఇంటికి చుట్టపుచూపుగా పద్మ సోదరి కుమార్తె, ఇద్దరు పిల్లలు వచ్చారు. అలాగే, ఆర్కే5 గనిలో మైనింగ్ సర్దార్‌గా పనిచేస్తున్న శనిగరపు శాంతయ్య వీళ్ల ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో గుర్తు తెలియని
వ్యక్తులు ఇంటికి నిప్పంటించారు. మంటలు ఇల్లంతా వ్యాపించి శివయ్య(50), భార్య రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ (45), రాజ్యలక్ష్మి అక్క కూతురు మౌనిక (33), ఆమె ఇద్దరు కుమార్తెలు హిమబిందు(4), స్వీటీ(2), సమీప బంధువు శాంతయ్య(50) సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనిగరపు శాంతయ్య కొంతకాలంగా పద్మతో వివాహేతర సంబంధం కలిగి ఉండటంతో వారింట్లోనే ఉంటున్నాడని సమాచారం. ఈ విషయంలోనే శాంతయ్య కొడుకులు గొడవ పడి ఈ ఘతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి ఎవరూ బయటకు రాకుండా గడియ పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాంతయ్య తన కుటుంబానికి దూరంగా ఉంటూ శివయ్య ఇంట్లోనే ఉంటున్నాడు. తండ్రి ఇంటికి రాకపోవడంతో ఆవేశంతో కుమారులే ఈ పని చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. శాంతయ్య ఆస్తిలో వాటా కావాలని పద్మ కోర్టుకు సైతం వెళ్లిందని బంధువులు పేర్కొంటున్నారు.
15 రోజుల కిందట హత్యాయత్నం!
వివాహేతర సంబంధం విషయంలో శాంతయ్యను కుటుంబ సభ్యులు నిలదీశారు. శాంతయ్య భార్య ఆయన పనిచేస్తున్న గని వద్దకెళ్లి గొడవ చేసింది. శాంతయ్యపై ఇటీవల హత్యాప్రయత్నం చేయగా తప్పించుకున్నట్టు సమాచారం. ఈ గొడవల నేపథ్యంలో అగ్ని ప్రమాద ఘటన విషయంలో పోలీసులు శాంతయ్య కుటుంబ సభ్యులను అనుమానిస్తున్నారు. పద్మపై సైతం దాడి చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో ఓ ఆటోలో కారంపొడి లభించింది.
ఉద్యోగం, పొలాల గొడవలే కారణమా..?
సింగరేణిలో మైనింగ్ సర్దార్‌గా పనిచేస్తున్న శాంతయ్య రెండేండ్లలో రిటైర్ కానున్నారు. ఆ ఉద్యోగం పద్మ సంబంధీకులకు ఇస్తారని శాంతయ్య కొడుకు భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారు శాంతయ్యను నిలదీసినట్టు తెలుస్తోంది. శాంతయ్య స్వస్థలం అయిన లక్షెట్టిపేట మండలం ఊత్కూరులో పొలాలు ఉన్నాయి. అవి చేజారిపోకుండా ఉండేందుకు తమ పేరిట రాయాలని గొడవ పడినట్టు తెలుస్తోంది.
చుట్టపు చూపుగా వచ్చి తల్లీపిల్లలు మృతి
కోటపల్లి మండలం కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక భర్త గతేడాది కరోనాతో మృతిచెందాడు. ఆమెకు తల్లిదండ్రులు కూడా లేరు. ఈ నేపథ్యంలో కొండంపేటలో నానమ్మ గడ్డం పోసక్క, అన్నయ్య ప్రశాంత్‌తో కలిసి ఉంటుంది. తల్లి సోదరి అయిన పద్మ ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేది. రెండ్రోజుల కిందట పద్మ భర్త శివయ్య వెళ్లి.. పిన్నికి ఆరోగ్యం బాగోలేదని తల్లీపిల్లలను తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, చుట్టం చూపుగా వచ్చిన మౌనిక, తన ఇద్దరు పిల్లలు అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ అఖిల్ మహాజన్, మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్ పరిశీలించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. 16 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్, అగ్నిమాపక, ఎలక్ట్రికల్ తదితర డిపార్ట్మెంట్ల అధికారులు వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని, దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. మృతుడు శాంతయ్యకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. శివయ్య-పద్మ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.