Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుక్క బుక్కకూ మట్టిపెళ్లలు
- నీళ్ల చారు, గంజి మెతుకులు
- రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి పాఠశాలలో పరిస్థితి
- ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్న విద్యార్థులు
- ప్రకటనలకే పరిమితమైన సన్నబియ్యం సరఫరా
- మధ్నాహ్న భోజన పథకానికి నిధుల కొరత
- జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
- పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని డిమాండ్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'బుక్క బుక్కకూ మట్టిపెళ్లలు.. మెత్తటి ముద్దల బువ్వ.. నీళ్ల చారు, గంజి మెతుకులు.. ఇలా ఉంటే అన్నం తినేదెట్టా..? వారంలో ఒక రోజు కూరగాయలు తప్ప ప్రతి రోజూ పప్పుచారే పెడుతారు. హెచ్ఎం సార్‌కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. తింటే తినండి లేదంటే ఊకోండని అంటున్నారు. ఇది తినలేక ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నాం. తాగడానికి నీళ్లు కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటున్నాం.' అని శివరాంపల్లి హైస్కూల్ విద్యార్థులు తమ గోడును 'నవతెలంగాణ'తో వెలిబుచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది. పాఠశాలల్లో మధ్నాహ్న భోజనంపై ప్రత్యేక కథనం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2,367 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. రెండు లక్షల 70 వేల 381 మంది విద్యార్థులు ఉన్నారు. రంగారెడ్డిలో 1,309 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, లక్ష 76 వేల 461 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 1,276 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి లక్ష 53 వేల 957 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వికారాబాద్‌లో 1,058 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 91,970 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇందుకుగాను నెలకు సుమారు రూ.కోటి 80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. చెప్పుకోవడానికి లెక్కలు బాగానే ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో విద్యార్థులు వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగునంగా మెస్ చార్జీలు పెంచకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వహణ కష్టంగా మారుతోంది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యంలో నాణ్యత లోపించడంతో అన్నం ముద్దలు ముద్దలు అవుతోంది. స్కూళ్లకు సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. అమలులో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. పాలిష్ బియ్యం సరఫరా చేయడంతో అన్నం వండితే ముద్దలు అవుతోంది. మరోవైపు ముద్ద ముద్దకు మట్టిపెళ్లాలు రావడంతో విద్యార్థులు తినలేకపోతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి హైస్కూల్‌ను పరిశీలిస్తే.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 6 నుంచి 10వ తరగతులకుగాను 1200 మంది విద్యార్థులు ఉన్నారు. 300 మంది మాత్రమే మధ్నాహ్న భోజనం తింటున్నారు. మిగతా 900 మంది ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. 'రోజూ నీళ్ల చారు.. దొడ్డు బియ్యం బువ్వ.. బుక్క బుక్కకు మట్టిపెళ్లల్లు వస్తుంటే.. తినేది ఎట్టా..?' అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అది తినలేక ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నామని తెలిపారు. మరోవైపు సౌకర్యాలు లేక చెట్ల కిందనే కూర్చొని తింటున్నారు. భోజన సమయంలో తాగడానికి గుక్కెడు నీళ్లుదొరకని పరిస్థితి ఉంది. విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకుంటున్న వాటర్ బాటిల్‌నే సాయంత్రం వరకు సరిపెట్టుకుంటున్నారు. అయితే, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచకపోవడం, మధ్నాహ్న భోజన కార్మికులకు సరిపడా నిధులు ఇవ్వకపోవడంతోనే ఉన్నదాంట్లో నిర్వాహకులు పెడుతున్నారు. మెనూ అమలు చేయలేకపోతున్నారు. వారంలో మూడు రోజులు గుడ్డు పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం గుడ్డు ధర రూ.7 ఉండగా ప్రభుత్వం ఇచ్చేది మాత్రం రూ.5. దీంతో వారంలో రెండు రోజులు మాత్రమే విద్యార్థులకు గుడ్డు పెడుతున్నారు. ఇప్పటికైనా మధ్యాహ్న భోజనానికి సరిపడా నిధులు ఇచ్చి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
మెనూ ప్రకారం భోజనం పెట్టేందుకు కృషి చేస్తాం
సుశీందర్ రావు- రంగారెడ్డి జిల్లా విద్యాధికారి
నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రయత్నం చేస్తు న్నాం. నిత్యావసర ధరలు పెరగడంతో ఇబ్బందులు ఎదురవతున్నాయి. అయినప్పటికీ వెసులుబాటు చేసుకుని నాణ్యమై న భోజనం అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే మెస్ చార్జీల ప్రకారం భోజనం తయారు చేయడం కష్టంగా ఉందని మధ్యాహ్న భోజన కార్మికులు చెబుతున్నా రు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినం. మెస్చారీ ్జలు పెంచాల్సి ఉంది.