Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తున్న బీజేపీ ప్రభుత్వం
- కేంద్ర బడ్జెట్లో పదిశాతం నిధులు కేటాయించాలి
- అందరికీ విద్య...ఉపాధి కల్పించడంలో మోడీ విఫలం
- ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ ఐక్య ఉద్యమం
- మహాసభలకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు
- ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడమే తమ లక్ష్యమని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత అధ్యక్షులు విపి సాను చెప్పారు. విద్యారంగాన్ని ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. అందులో భాగంగానే నూతన విద్యావిధానాన్ని తెచ్చిందన్నారు. ఈ మహాసభల నిర్వహణ కోసం సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో ఉన్న ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం నుంచి నిర్వహించిన ఎస్ఎఫ్ఐ అఖిల భారత 17వ మహాసభలు శుక్రవారం ముగిసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో విపి సాను మాట్లాడుతూ 83 మందితో కేంద్రకమిటీ, 19 మందితో కార్యదర్శివర్గం ఏర్పడిందని వివరించారు. విద్యారంగం, విద్యార్థుల సమస్యలు, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర అంశాలకు సంబంధించి 36 తీర్మానాలను మహాసభ ఆమోదించిందని వివరించారు. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామిక హక్కులు, ప్రభుత్వ నిర్బంధంపై చర్చించామని అన్నారు. మేధావులు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులతో సంప్రదించి ప్రత్యామ్నాయ విద్యావిధానాన్ని ఆమోదించామని చెప్పారు. విద్యార్థులందరూ చదువుకోవాలంటే ప్రభుత్వ విద్యాసంస్థలు మరిన్ని కావాలని అన్నారు. కొఠారి కమిషన్ సిఫారసుల ప్రకారం జీడీపీలో
ఆరు శాతం, కేంద్ర బడ్జెట్లో పది శాతం కేటాయించాలన్నారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. జీడీపీలో 2.8 శాతం నిధులు మాత్రమే కేటాయించిందని చెప్పారు. కనీసం ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యలో 45 శాతం డ్రాపౌట్ రేటు ఉందన్నారు. వారిలో ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ, మైనార్టీలే ఎక్కువ మంది ఉంటారని వివరించారు. వంద శాతం విద్యార్థులకు బడులకు వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకోవైపు ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమితో ప్రభుత్వ విద్యాసంస్థలు సమస్యలతో ఉన్నాయని అన్నారు. దీంతో ప్రయివేటు విద్యాసంస్థల్లో విద్యార్థులు చేరుతున్నారని చెప్పారు. వాటిలో ఫీజుల భారం ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు విద్యావ్యాపారాన్ని మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. ఎన్ఈపీ ద్వారా విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ చేసేందుకు కుట్ర చేస్తున్నదని అన్నారు. మౌలానా ఆజాద్ ఫెలోషిప్‌లు, విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఖండించారు.
వాటిని పునరుద్ధరించి విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థులకు నైపుణ్యం పెంచాలనీ, పరిశోధనలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యారంగం, విద్యార్థుల సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాలను కలుపుకుని ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తామని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మాట్లాడుతూ ఈ మహాసభలు ఓయూలో నిర్వహించడం చారిత్రాత్మకమని అన్నారు. ఇందుకు అవకాశం కల్పించిన ఓయూ పరిపాలనా సిబ్బంది, వీసీ, రిజిస్ట్రార్, మహాసభల విజయవంతం కోసం సహకరించిన ఆహ్వానసంఘం, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఘంటా చక్రపాణి, ఆర్ లింబాద్రి, కె నాగేశ్వర్, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు, కళాకారులు, మీడియా, ఆర్థికంగా, హార్దికంగా సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, నగర కార్యదర్శి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.