Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీడీ ఆకుపై పన్నుకు మేం వ్యతిరేకం
- జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సంబంధిత సేవలైన కస్టమ్స్ మిల్లింగ్, ట్రాన్స్‌పోర్టు సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు అందించే ఈ సేవలపై జీఎస్టీ విధించటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్న దని ఆయన తెలిపారు. అందువల్ల ఆయా సేవలకు జీఎస్టీ సేవల నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ 48వ కౌన్సిల్ మీటింగ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో నిర్వహించారు. హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా హరీశ్‌రావు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ కింద 46 వేల జలాశయాలున్నాయనీ, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ప్రతీ ఏడాదీ నీటి నిర్వహణ చేయటం ఎంతో ముఖ్యమని వివరించారు. తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ నిర్వహణను చేపడుతున్నదనీ, అయితే దాంతోపాటు మరమ్మతు పనులను జీఎస్టీ నుంచి మినహాయింపు నివ్వాలని కోరారు. బీడీ ఆకుపై పన్ను విధించటాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. గిరిజన, పేద, మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా ఎంతో మంది మహిళలు బీడీలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఇప్పటికే కేంద్రం బీడీలపై 28 శాతం జీఎస్టీని విధించిందని, దాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇప్పుడు ముడి సరుకు అయిన ఆకులపై కూడా 18 శాతం జీఎస్టీ విధిస్తే పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఆకులపై పన్నుకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశారు. ట్యాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ ప్రపోజల్‌ను స్వాగతిస్తున్నామని హరీశ్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే దానిపై ఉన్న సంశయాలను నివృత్తి చేయాలంటూ కౌన్సిల్‌ను కోరారు. ముఖ్యంగా టెలికాం సేవలకు సంబంధించి ట్రారు నియమ నిబంధనల వల్ల కస్టమర్ అడ్రస్, పిన్ నెంబర్ పే టీఎమ్, మోబి క్విక్, బిల్ డెస్క్ తదితరాలు ఆన్లైన్ వ్యాపార సంస్థల వద్ద ఉండే అవకాశం లేదని తెలిపారు. దీంతో వినియోగదారులున్న రాష్ట్రాల ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళుతుందని వివరించారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనల్లో సవరణలు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్సులో సీఎస్ సోమేశ్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.