Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో వింత పరిస్థితి
- సెస్ వసూలులో నిర్మాణ సంస్థలతో లాలూచీ
- మెట్రో కట్టాల్సింది రూ. 400 కోట్లపైనే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో వేల కోట్ల రూపాయల నిధులున్నా..సంక్షేమం కోసం ఖర్చుపెడుతున్నది అంతంతే. కరోనా కాలంలో కార్మికులకు అండగా ఉండాల్సిన బోర్డు.. రూ. 1005 కోట్లను సివిల్ సప్లరు శాఖ కు దారిమళ్లించింది. కార్మిక శాఖలోని కొందరు అధికారులే తప్పుడు పత్రాలు సృష్టించి నిధుల ను స్వాహా చేసిన వైనం పలు జిల్లాల్లో బయట పడింది. సెస్ వసూలు విషయంలో మెట్రో, మిషన్‌భగీరథ, కాకతీయ లాంటి పెద్దపెద్ద తిమింగలాలను బోర్డు వదిలివేస్తున్నది. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడటమే దీనికి కారణమనే విమర్శ కూడా ఉంది. ఆయా నిర్మా ణాల సంస్థలకు కొమ్ముకాస్తూ చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో వెల్ఫేర్బోర్డుకు దక్కాల్సిన కోట్ల రూపాయలకు గండి పడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికిపైగా భవన నిర్మాణ కార్మికులున్నారు. అందులో 13 లక్షల మంది కార్మికులకే సంక్షేమ బోర్డులో సభ్యత్వం ఉంది. ప్రస్తుతం బోర్డులో సభ్యత్వం పొందా లంటే ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టింది. దీనికి తోడు సభ్యులను చేర్పించటంలోనూ, రెన్యువల్ చేయించటంలోనూ కార్మికశాఖ అలసత్వం కనిపి స్తున్నది. భవన నిర్మాణ కార్మికుల్లో ఎక్కువగా నిరక్షరాస్యులు ఉండటంతో సభ్యత్వ రెన్యూవల్, కొత్తగా చేరటం వంటి వాటిపై చాలా మేరకు అవగాహన లేదు. దీంతో లక్షలాది మంది వెల్ఫేర్ బోర్డు కిందికి రాకుండా పోతున్నారు. ప్రమాద సమయాల్లో ప్రాణనష్టం జరిగితే ఆ కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ప్రమాద, సహజ మరణా లకు, పెండ్లికానుక, అంగవైకల్యానికి ఇచ్చే సహాయాన్ని చాలా ఏండ్ల నుంచి పెంచట్లేదు. కేరళ, పంజాబ్, హర్యానా, కర్నాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అరవై ఏండ్లు నిండిన భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఫించన్లు, వారి పిల్లలకు స్కాలర్షిప్పులు అందుతున్నాయి. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు కార్మికులకు ద్విచక్ర వాహనాలను అందజేస్తున్నాయి. కర్నాటకలో కిడ్నీ, క్యాన్సర్, ఎలర్జీ, కుష్టు వ్యాధులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా వైద్యసేవలను అందిస్తున్నాయి. అడ్డాప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కార్మికులు ఏండ్ల తరబడి మొత్తుకుంటున్నప్పటికీ కార్మిక శాఖ పెడచెవిన పెడుతున్నది.
సెస్..వసూలు మిస్..
వెల్ఫేర్‌బోర్డు వద్ద వేల కోట్ల నిధులున్నా కార్మికులకు అందుతున్న సహాయం అంతంతే. ఇప్పటిదాకా రూ.760 కోట్లను 1,26,000 వేల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నది. కార్మికుల సంక్షేమానికి వాడాల్సిన నిధులను కరోనా కాలంలో సివిల్ సప్లరు శాఖకు మళ్లించింది. ఇప్పటి వరకూ అవి తిరిగి జమ చేయలేదు. సుమారు 2,500 కోట్ల రూపాయల సెస్ వసూలు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ తాత్సారం వహిస్తున్నది. వాస్తవానికి రూ.10 లక్షల పైబడిన నిర్మాణదారుల నుంచి ఒక శాతం లేబర్ సెస్ వసూలు చేయాలి. ఆ నిధులను వెల్ఫేర్‌బోర్డు నుంచి కార్మిక సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. కానీ, ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలు, ప్రాజెక్టుల గుత్తేదారులను టచ్‌కూడా చేయట్లేదు. వెల్ఫేర్‌బోర్డు మెట్రో సంస్థ కట్టాల్సిన సొమ్ము రూ. 400 కోట్లకుపైనే ఉంది. మిషన్‌భగీరథ, కాకతీయ కాంట్రాక్టర్లు రూ.366 కోట్ల సెస్సును చెల్లించలేదు. ఒకవేళ ఏ సంస్థయినా చెల్లించకపోతే వడ్డీతో సహా వసూలు చేయాల్సిన కార్మిక శాఖ అధికారులు...ఆయా సంస్థలతో లాలూచీ పడి ఆవిషయాన్నే పక్కనపడేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కార్మిక సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్హత లేని వారిపేరిట నిధులను స్వాహా చేశారు. ఒక్కొక్కరి పేరుమీద రెండుసార్లు విత్‌డ్రా చేసిన పరిస్థితి. దీనిపై కార్మిక శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. రాష్ట్ర కేంద్రంలోని వెల్ఫేర్ బోర్డు నుంచి ఫైల్ క్లియర్ అయిన తర్వాత కూడా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడట్లేదు. అధికారులను అడిగితేనేమో 'మేం వేశాం' అని దాటవేస్తున్నారు.
సెస్ సొమ్ము కార్మికులకే ఖర్చుపెట్టాలి
ఆయా సంస్థల నుంచి సెస్ వసూలు చేయడంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయని ఎప్పటి నుంచో ఆందోళన లు చేస్తున్నాం. ఇప్పటికైనా కార్మిక శాఖ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి ఆయా సంస్థల నుంచి వడ్డీతో సహా సెస్ వసూలు చేయాలి. ఇప్పటిదాకా తాత్సారం చేసిన అధికారుల పైనా చర్యలు తీసుకోవాలి. మంత్రులు హరీశ్‌రావు, మల్లా రెడ్డి ఇచ్చిన హామీల మేరకు భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లను వెంటనే పంపిణీ చేయాలి. లక్ష మోటార్ సైకిళ్ల వరకే పరిమితం కాకుండా అర్హులం దరికీ ఇవ్వాలి. సెస్ వసూలు పకడ్బందీగా జరగాలి. కార్మికుల సంక్షేమం కోసం అక్కరకు రాని నిధులు ఎన్ని వేల కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డులో ఉన్నా ప్రయోజనం లేదు.
ఆర్.కోటం రాజు, తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి