Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీడీ కార్మికుల నడ్డివిరుస్తున్న పాలకులు
- 28 శాతం జీఎస్టీ, క్యాన్సర్ బొమ్మ ముద్రణతో తీవ్ర నష్టం
- రోజురోజుకీ తగ్గిపోతున్న ఉపాధి
- ప్రత్యామ్నాయ ఉపాధి చూపడంలో విఫలం
- 2011 నుంచి కనీస వేతన జీవోను అమలు చేయని రాష్ట్ర సర్కారు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉత్తర తెలంగాణలో బీడీ రంగం కీలకమైనది. దానిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నేతల గెలుపోటముల్లో ప్రభావం చూపే స్థాయిలో వారున్నారు. అలాంటి కార్మికులకు మేలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పుడు వారి ఉపాధికే ఎసరు వచ్చింది. 28 శాతం జీఎస్టీ, క్యాన్సర్ బొమ్మ ముద్రణతో కార్మికుల పొట్టగొట్టిన బీజేపీ ప్రభుత్వం తాజాగా తునికాకుపైనా జీఎస్టీ వేయాలని చెప్పటమంటే బీడీ పరిశ్రమ నడ్డి విరగ్గొట్టడమే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమూ తానేం తక్కువ కాదంటూ కనీస వేతనాల జీవోలను తొక్కిపెడుతూ తీవ్ర అన్యాయం చేస్తున్నది. పింఛన్ల మంజూరీలోనూ సవాలక్ష ఆంక్షలు పెడుతూ ఆయా కుటుంబాల్లో పంచాయతీ పెడుతున్నది.
రాష్ట్రంలో 16 జిల్లాల్లో ఏడు లక్షల మంది బీడీ కార్మికులుదీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. తునికాకు సేకరణ ద్వారా మరో ఐదు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలే. అందులోనూ మహిళా కార్మికులు ఎక్కువ. బీడీ పరిశ్రమ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉంది. నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్, వనపర్తి, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. 45 నియోజకవర్గాల్లో రాజకీయ నాయకులు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నది. సిగార్ అదర్ టొబాకో ఉత్పత్తుల యాక్ట్ -2013కు సవరణలు చేసి బీడీ కట్టలపై పుర్రెబొమ్మ, 2014లో క్యాన్సర్ బొమ్మను ముద్రించాలని రాష్ట్రాలకు ఆదేశించడం బీడీ పరిశ్రమపై చాలా ప్రభావం పడింది. ఆ తర్వాత బీడీ కట్టలపై 18 శాతం ఉన్న జీఎస్టీని 28 శాతానికి పెంచింది. తాజాగా తునికాకు సేకరణపైనా జీఎస్టీ విధించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇలా బీడీ పరిశ్రమపై దెబ్బమీద దెబ్బ వేస్తూ ఆ పరిశ్రమ నడ్డివిరిచే పనిలో మోడీ సర్కారు ఉన్నది. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు బండి సంజరు, అర్వింద్‌కుమార్, ఎస్.బాపూరావు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే బీడీ పరిశ్రమ విస్తరించి ఉంది. కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నప్పటికీ ఆ ముగ్గురూ పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడం బీడీ కార్మికుల పట్ల వారి చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్ధమవుతున్నది. కేంద్రం తీరు వల్ల చాలా కంపెనీలు బీడీ తయారీని తగ్గించేశాయి. దీంతో కార్మికులకు 10 నుంచి 15 రోజులకు మించి పనిదినాలు దక్కట్లేదు. గతంలో 26 పనిదినాలు కార్మికులకు దక్కేవి.
రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్న 73 షెడ్యూల్ పరిశ్రమల జాబితాలో బీడీ రంగం కూడా ఉంది. దీనికి సంబంధించి కనీస వేతన నిర్ణయం జరిగింది. 2011 ఫిబ్రవరిలో జీవో నెంబర్ 41 కూడా విడుదలైంది. ఆనాడు పరిశ్రమల యాజమాన్యాల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి 98 శాతం కార్మికుల పొట్టగొట్టింది. జీవో నెంబర్ 81 తీసుకొచ్చి బీడీ కార్మికుల కుటుంబాలకు అన్యాయం చేసింది. ఆ జీవో గడువు అయిపోయినప్పటికీ పెరిగిన వేతనాలు మాత్రం అమల్లోకి రాలేదు. వాస్తవానికి ప్రతి వెయ్యి బీడీలకు రూ.221. 21 పైసలు ఇవ్వాలి. ప్రస్తుతం వెయ్యి బీడీలకు రూ.170-రూ.150 మాత్రమే కార్మికులకు దక్కుతున్నది. ఒకవేళ జీవో నెంబర్ 41 అమలయ్యి ఉంటే రూ. 400 దక్కేవి. ఇది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాపం. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. దీంతో ఒక్కో కార్మికుడు వెయ్యి బీడీలపై రూ.230 నుంచి రూ.250 మేరకు నష్టపోతున్నాడు. తెలంగాణ రాష్ట్రమొస్తే బీడీ కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపుతానన్న సీఎం కేసీఆర్ హామీ నీటి మీద రాతలాగే మిగిలింది. పైగా ఆ కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. జీవన భృతి విషయంలోనూ తీవ్ర అన్యాయం చేస్తున్నది. 2014 ఫిబ్రవరి లోపు పీఎఫ్ నెంబర్లు ఉన్నవారికే పింఛన్లు ఇస్తామని మెలికపెట్టింది. ఇంట్లో ఎవరికైనా వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు వస్తే బీడీ కార్మికులకు ఇవ్వబోమని తిరకాసు పెట్టింది. ఇది ఆ కుటుంబాల్లో పంచాయితీ పెట్టి కూర్చున్నది.
కనీస వేతనాల జీవో విడుదల చేయాలి..అందరికీ పింఛన్ ఇవ్వాలి
ఎస్వీ.రమ, తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కరోనా టైమ్‌లో సీఐటీయూ అనేక పోరాటాలు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నెలకు రూ.6 వేలు ఇప్పించగలిగాం. 2 వేతన అగ్రిమెంట్లు కూడా చేయించుకోగలిగాం. బీడీ కార్మికుల సమస్యలపై బీజేపీగానీ, టీఆర్ఎస్ గానీ పోరాడిందేమీ లేదు. బీడీ కార్మికుల కనీస వేతనాల జీవోను వెంటనే విడుదల చేయాలి. 26 రోజుల పనిదినాలు కల్పిస్తూ ప్రతి వెయ్యి బీడీలకు రూ.800 చెల్లించాలి. పీఎఫ్, నాన్‌పీఎఫ్ అనే తేడా లేకుండా బీడీ కార్మికులందరికీ ప్రతి నెలా పింఛన్ ఇవ్వాలి. బీడీ ప్యాకర్లు, రోలర్లు, చాటన్ కార్మికులు, టేకేదార్ల సమస్యలను పరిష్కరించాలి. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తాం.