Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
బాలల బంగారు భవిష్యత్‌కు వారి హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఉందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా వరంగల్ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జ్యూడిషరీ ప్రోగ్రామ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భయన్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్, హైకోర్ట్ జడ్జి నవీన్‌రావుతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఉన్న ఇతర కోర్టులను కోర్టులు అన్నా ఎటువంటి ఇబ్బంది లేదని, కానీ పిల్లల కోర్టులను మాత్రం న్యాయ దేవాలయాలుగా పిలవాలని సూచించారు. వరంగల్‌లో పోక్సో యాక్ట్ కేసులు 256 ఉంటే 146 కేసులను పరిష్కారం చేసారని, ఇందులో 40 కేసులకు శిక్ష పడిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా 92.6శాతం పెండింగ్‌లో ఉండగా ఇక్కడ కోర్టులో 40 శాతం పరిష్కారించడం అభినందించదగ్గ విషయమన్నారు. చిన్నారుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయని అన్నారు. కోవిడ్ సమయంలో చిన్నారులపై లైంగికదాడులు రెట్టింపయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు సమన్వయంగా కృషి చేస్తేనే బాలలపై జరుగుతున్న ప్రమాదాలను నివారించగలమని చెప్పారు. బాలలపై అసాంఘిక కార్యక్రమాలు ఎవరికి చెప్పాలో, ఎవరిని ఆశ్రయించాలో అన్న విషయాలపై పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాలల హక్కుల దినోత్సవాలు జరగాలని, వారి హక్కులను కాపాడాలన్నారు. పిల్లలు సున్నితంగా ఉంటారని, వారిపై తల్లిదండ్రులు, సమాజం ప్రభావం గణనీయంగా ఉంటుందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో నిందితుల క్షమాపణ కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చిన్నారులకు, వారి కుటుంబ సభ్యులకు తక్షణమే నష్ట పరిహారంతో పాటు భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. బాధితులపై సమాజం చిన్న చూపు తగదన్నారు. ముఖ్యంగా బాలికలకు సొంత కుటుంబ సభ్యుల మధ్యనే రక్షణ కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఎవరికీ చెెప్పకపోవడంతో ఆ ప్రభావం బాలికలపై దీర్ఘ కాలంగా ఉంటుందన్నారు. తాను చేపట్టిన భారత్ యాత్ర మంచి ఫలితాలు ఇస్తుందని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఉజ్వల్ భయన్ మాట్లాడుతూ.. పోక్సో కోర్టులు ఇతర జిల్లాల్లో కూడా విస్తరింపచేయాలని తెలిపారు. బాల్య వివాహాలు జరగడానికి కుటుంబ పెద్దల ప్రోత్సాహమే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ నైతిక ప్రవర్తన అలవార్చుకోవాలని చెప్పారు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. చిన్నారుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. సమావేశానికి జిల్లా జడ్జి కె. రాధాదేవి సభకు అధ్యక్షత వహించగా హనుమకొండ, వరంగల్, పోలీస్ కమిషనర్ రంగనాధ్, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డాక్టర్ గోపి, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రవీన్య, కూడా ఛైర్మెన్ సంగం రెడ్డి సుంధర్ రాజ్, లా కార్యదర్శి నర్సింగ రావు, జడ్జి కృష్ణమూర్తి, బార్ కాన్సి ల్ అధ్యక్ష కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.