Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ పథకాలు తాత్కాలికం.. శాశ్వత ఉపాధి కల్పించాలి
- నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ వ్యక్తి యాకయ్య : సంస్మరణ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-ఇల్లందు
కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారన్న వారికి దీటుగా అసలు కమ్యూనిస్టులే లేకపోతే దేశ భవిష్యత్తు ఏమిటనే చర్చ జరగాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజలకు మేలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని వినోభా కాలనీలో ఆదివారం సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య సంస్మరణ సభ జరిగింది. తొలుత రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సోమయ్య జెండావిష్కరణ చేయగా, అనంతరం తమ్మినేని స్ధూపావిష్కరణ చేశారు. దేవులపల్లి యాకయ్య విజ్ఞాన కేంద్రానికి మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మిడియం బాబురావు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రంథాలయాన్ని ప్రారంభించారు. యాకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కార్యదర్శి అబ్దుల్ నబి అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో తమ్మినేని మాట్లాడుతూ.. తాను నమ్మిన సిద్దాంతం కోసం దేవులపల్లి యాకయ్య నిలబడ్డారని అన్నారు. సింగరేణి ఉద్యోగాన్ని వదిలి పార్టీ అభివృద్ధికోసం పాటుబడ్డారని కొనియాడారు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని సైతం కమ్యూనిస్టు బాటలో పయనింపజేశారని గుర్తుచేశారు. ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా పార్టీని వదలకుండా నిక్కచ్చిగా నిలబడ్డారన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ తాత్కాలికమేనని, ప్రజల కొనుగోలుశక్తి పెరగాలంటే శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. కమ్యూనిస్టు పాలనలో ఉన్న రాష్ట్రం, దేశాలలో విద్యా, వైద్యం ఇలా ఏడు రకాల అంశాలు అమలులో ఉన్నాయి, వీటి ఆధారంగా ఉపాధి పొంది వారి కాళ్ళపై వాళ్ళు నిలదొక్కుకునేలా చేస్తున్నారన్నారు. కమ్యూనిస్టులకు, ఇతర ప్రభుత్వాలకు ఉన్న తేడా ఇదే అన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందాలన్నారు. మనిషి బతకాలంటే ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ప్రభుత్వాలు ఉండాలని తెలిపారు. డబ్బు లేకపోతే మనిషి చనిపోయే పరిస్థితి ఉండకూడదన్నారు. సమాజంలో అందరికీ అన్ని అవకాశాలు కల్పించడం కమ్యూనిస్టుల లక్షణమన్నారు. సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, సాదుల శ్రీనివాస్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, ఇల్లందు మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.