Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఎమ్మెల్యేల ఎరకేసు విషయంలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు బీజేపీని విమర్శిస్తుండటంతో దాన్ని తప్పుదోవపట్టించేందుకు నోటీసుల పేరుతో కుట్రలు చేస్తున్నారని తాండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ఆయన తన పార్టీ నాయకులతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటక నుంచి నోటీసులు వచ్చాయని చెప్పిన బండి సంజరు వాటిని నేటికీ చూపించలేదన్నారు. బీజేపీ నాయకులకు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, రాష్ట్రంలో అధికార పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలతో టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిజమైన హిందువుగా అమ్మవారి వద్ద సవాల్ చేశాననీ, బండి సంజరు తన సవాల్‌ను స్వీకరించలేదన్నారు. దాంతో బండి సంజరు చేసిన ఆరోపణలు తప్పని ప్రజలకు అర్థం అయిందన్నారు. బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఎక్కడికి రమ్మన్నా వస్తానని.. వేములవాడ లేదా తాండూరు బద్రేశ్వర స్వామి ఆలయం.. ఎక్కడైనా తాను రెడీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పాతబస్తీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.