Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రౌండ్ డేటా సేకరణ, పనులు వేగవంతం కోసం సర్వే బృందాలు
- మెట్రో రూట్లో ఎండీ ఎన్వీఎస్ కాలినడకన నడుస్తూ తగిన ఆదేశాలు
- ప్రధాన రహదారుల వెంబడి మెట్రో స్టేషన్ల నిర్మాణాలు
- మెట్రో కారిడార్ ఉండాలని ఇంజనీర్లకు మెట్రో ఎండీ ఆదేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ నిర్ణయించింది. అలైన్మెంట్ ఖరారు, గ్రౌండ్ డేటా సేకరణ తదితర పనులు త్వరితగతిన చేసేందుకు రెండు సర్వే బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, మెట్రో స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత ఉండాలనే విషయంలో ఈ డేటా కీలకం కానుంది. ఈ మేరకు ఈ సర్వే పనులను అదివారం హెచ్ఏఎంఎల్ సీనియర్ ఇంజనీర్ల బృందంతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు ఉన్న ఎయిర్పోర్ట్ మెట్రో మార్గాన్ని పరిశీలించారు. దాదాపు 10 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ మార్గంలో కాలినడకన నడుస్తూ ఇంజనీర్లకు, సర్వే బృందాలకు ఎన్వీఎస్ రెడ్డి తగిన ఆదేశాలిచ్చారు. ఆ వివరాలు..మెట్రో స్టేషన్ల నిర్మాణం ప్రధాన రహదారి జంక్షన్లకు దగ్గరగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశించిన విధంగా ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్‌ను నగర విస్తరణ ప్రణాళికలో భాగంగా నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఈ కారిడార్ కేవలం విమానాశ్రయ ప్రయాణీకులకు మాత్రమే కాకుండా, ఇతరులకూ ఉపయోగపడేలా ఉండాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు.
భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ నిర్మించే మెట్రో స్టేషన్లు, అవసరమైన స్కైవాక్‌ల నిర్మాణానికి సంబంధించి సూచించాలని సర్వే బృందాన్ని ఎండీ ఆదేశించారు. మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్రయాణీకుల వాహనాల పార్కింగ్ ఏరియా కోసం సూచించాలని చెప్పారు.రాయదుర్గ్ స్టేషన్ నుంచి సుమారు 900 మీటర్ల మేరకు ఎయిర్‌పోర్టు మెట్రో కోసం రాయ దుర్గ్ స్టేషన్‌ను పొడిగిస్తున్నప్పుడు, పొడిగించిన బ్లూ లైన్ కొత్త టెర్మినల్ స్టేషన్, ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్లను అనుసంధానానికి సంబంధించిన అవకాశాలను అన్వేషించామన్నారు. ఈ ప్రదేశంలో స్థలాభావం ఉన్నందువల్ల ఐకియా భవనం తర్వాత ఎల్అండ్టీ, అరబిందో భవనాల ముందు ఈ రెండు కొత్త స్టేషన్లు ఒకదానిపై ఒకటి నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. మొదటి రెండు అంతస్తుల్లో ఎయిర్పోర్ట్ కొత్త రాయదుర్గ్ స్టేషన్, పొడిగించబడిన కొత్త బ్లూలైన్ స్టేషన్ ఎగువ రెండు అంతస్తుల్లో ఉండేలా డిజైన్ చేయాలన్నారు.
మెట్రో కారిడార్-2 (గ్రీన్ లైన్)లో నిర్మించిన జేబీఎస్ స్టేషన్, అలాగే అమీర్‌పేట్ ఇంటర్చేంజ్ స్టేషన్ల మాదిరిగా నాలుగు అంతస్తు ల్లో ఈ స్టేషన్ల నిర్మాణం ఉండబోతున్నట్టు తెలి పారు. ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ మెట్రో మొదటి స్టేషన్‌కి ప్రవేశం.. నిష్క్రమణలు ప్లాన్ చేసే ముందు, ఇక్కడకు దగ్గరలోనే ట్రాన్స్‌కో సంస్థ ఇటీవల వేసిన 400 కేవీ అదనపు హై వోల్టేజ్ భూగర్భ విద్యుత్ కేబుళ్లను పరిగణలోకి తీసుకొని వాటిని మార్చకుండానే డిజైన్ చేసేలా ప్లాన్ చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. అలాగే, మెట్రో మొదటి దశలో సైబర్ టవర్స్ జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర చేసినట్టు, ఫ్లైఓవర్ ర్యాంప్ పక్కనే మెట్రో పిల్లర్లు ఉండాలన్నారు.
బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్‌ను ప్లాన్ చేసేటప్పుడు, ఇదే మార్గంలోనే సమీప భవిష్యత్తులో నిర్మించనున్న బీహెచ్ఈఎల్-లక్డీకాపుల్ మెట్రో కారిడార్‌పై కూడా దృష్టి సారించాలని సూచించారు. నార్సింగి, కోకాపేట, మరి ఇతర సమీప ప్రాంతాలలో వస్తున్న కొత్త కాలనీలు, వాణిజ్య సదుపాయాల అవసరాలను గుర్తించి నార్సింగి జంక్షన్ సమీపంలో నిర్మించే మెట్రో స్టేషన్ స్థానాన్ని ప్లాన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఏఎంఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ డీవీఎస్ రాజు, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ బి. ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్లు ఎం. విష్ణువర్ధన్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ నాయక్, ఇతర సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు.