Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 80 వేల మంది విద్యార్థుల మనోవేదన
- మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలపై సర్కారు కాలయాపన
- అమలుకు నోచుకోని విద్యామంత్రి హామీ
- ఇంటర్ విద్యార్థుల భవిత ప్రశ్నార్ధకం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ప్రయివేటు కాలేజీల అనుబంధ గుర్తింపు విషయంలో ఏటా ఆలస్యమవుతున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మే నాటికి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తాం. మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్న కాలేజీలకు ఈ ఏడాది, వచ్చే విద్యాసంవత్సరంలోనూ గుర్తింపు ఇస్తాం. ఇందుకు సంబంధించి హోంమంత్రితో సంప్రదించాం. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యాలే శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాలి.'అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి గతనెల 11న హైదరాబాద్లోని నిర్వహించిన ఇంటర్ బోర్డు పాలకమండలి సమావేశంలో చెప్పారు. నెలరోజులు దాటినా మంత్రి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో రాష్ట్రంలో మిక్స్డ్ ఆక్సుపెన్సీలో ఉన్న 465 కాలేజీల్లో చదువుతున్న సుమారు 80 వేల మంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కాలేజీలకు మాత్రం ఇంకా అనుబంధ గుర్తింపును ఇంటర్ బోర్డు ప్రకటించలేదు. దీంతో పరీక్షలు రాస్తామా? లేదా? అన్న అయోమయంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా ప్రభుత్వం ఆ కాలేజీలకు పరీక్షలకు ముందు అనుబంధ గుర్తింపును ఇస్తుంది. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంకా గుర్తింపును ప్రకటించకపోవడంతో మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్న కాలేజీ యాజమాన్యాలతోపాటు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంకోవైపు ఆయా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ప్రయివేటుగా పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇంకోవైపు అనుబంధ గుర్తింపునూ ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 1,575 ప్రయివేటు జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటి వరకు 1,010 కాలేజీలకు మాత్రమే అనుబంధ గుర్తింపు వచ్చింది. మిగిలిన 465 కాలేజీలకు ఇంకా రాలేదు. మరో వంద కాలేజీలు వివిధ సాంకేతిక కారణాలతో గుర్తింపు పొందలేదు. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2023, మార్చిలో జరిగే వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు ఆలస్య రుసుం రూ.500తో ఈనెల 17 వరకు, రూ.వెయ్యితో 22 వరకు, రూ.ఐదు వేలతో ఈనెల 28వ తేదీ వరకు అవకాశమున్నది. అయితే ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు కోరుతున్నారు.
సీఎం జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలి : గౌరి సతీశ్,టీపీజేఎంఏ అధ్యక్షులు
రాష్ట్రంలో మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీ సమస్య 2019-20 విద్యాసంవత్సరంలో వచ్చింది. 15 నుంచి 20 ఏండ్ల కింద నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్న ఈ కాలేజీలకు ప్రభుత్వం కొత్తగా నిబంధనలు పాటించాలని చెప్పడం సరైంది కాదు. కొత్తగా స్థాపించే కాలేజీలకు ఈ నిబంధనను వర్తింపచేయాలి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాత కాలేజీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపాలి. ఆ నిబంధన నుంచి పాత కాలేజీలకు మినహాయింపునిచ్చి అనుబంధ గుర్తింపును ప్రకటించాలి.