Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస మద్దతు ధరల చట్టం చేయాల్సిందే
- రైతాంగ సమస్యలపై దేశవ్యాప్త పోరాటం
- పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
- తెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి సాగర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పది లక్షల మంది కార్మికులు, కర్షకులతో ఏప్రిల్ ఐదో తేదీన పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ప్రకటించారు. కనీస మద్దతు ధరల చట్టం చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలు చేపడతామన్నారు. రాబోయే కాలంలో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులను గెలిపించాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని రైతుసంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ 35వ మహాసభలు కేరళలోని త్రిసూర్‌లో ఈనెల 13 నుంచి 16 వరకు విజయవంతంగా జరిగాయని వివరించారు. రైతాంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై 16 తీర్మానాలను మహాసభ ఆమోదించిందని చెప్పారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలనీ, రుణ విమోచన చట్టం చేయాలనీ, పంటలబీమా పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడేలా రూపొందించాలని కోరారు. చిన్న-సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలకు నెలకు రూ.ఐదు వేల పెన్షన్ ఇవ్వాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం అర్హులైన వారందరికీ హక్కు పత్రాలివ్వాలని చెప్పారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలను అమలు చేయాలన్నారు. తెలంగాణ రైతుసంఘం ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతు వ్యతిరేకమని విమర్శించారు. దేశంలో ఆహార నిల్వలు తగ్గిపోయాయని అన్నారు. ఇంకోవైపు రైతులు పండించిన పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేరళలో బలంగా అమలవుతున్న సహకార వ్యవస్థను అధ్యయనం చేశామన్నారు. దాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, ప్రజలు, మహిళలకు ఉపయోగమని ఆశాభావం వ్యక్తం చేశారు. వాణిజ్య బ్యాంకుల్లో ఉన్న నిధుల్లో 18 శాతం వరకే వ్యవసాయ రంగానికి కేటాయిస్తాయని చెప్పారు. కానీ సహకార బ్యాంకుల్లో ఉండే నిధులన్నీ వ్యవసాయం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ పాల్గొన్నారు.
భవిష్యత్ కార్యాచరణ :
- ఏప్రిల్ 5న కార్మికులు, కర్షకులతో పది లక్షల మందితో పార్లమెంట్ మార్చ్ నిర్వహణ.
- సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో కనీస మద్దతు ధరల చట్టం చేయాలనీ, రుణమాఫీ చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని దశలవారీగా ఆందోళనలు.
- రాజస్థాన్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక బీజేపీని ఓడించాలి.