Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్‌లో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ జీవోలు
- సర్కారుపై పైసా భారం పడకున్నా...
- ఎనిమిదేండ్లయినా సవరించని జీవోలు
- కోటీ 20 లక్షల మందికిపైగా కార్మికుల ఎదురుచూపులు
- పరిశ్రమల్లో ఎక్కువగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ట్రైనీ కార్మికులే
ఓవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు...ఇంకోవైపు ఇంటి అద్దెలు...మరోవైపు పాలకులు, యాజమాన్యాల తీరుతో ఉద్యోగ భద్రత కరువు..వెరసి కార్మికుల జీవితాలు ఆగమాగం అవుతున్నాయి. జీతాలు పెంచండి అంటూ మొరపెట్టుకున్నా పట్టించుకునేవాళ్లు లేకపోగా..యాజమాన్యాలు మరింత కోత పెడుతున్న పరిస్థితి ఉంది. పరిశ్రమలన్నీ అరకొర వేతనాలిస్తూ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ట్రైనీ, ఫిక్స్డ్టర్మ్, తదితర పేర్లతో కార్మికులతో గొడ్డుచాకిరీ చేయించుకుంటూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయి. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లో జీవోలు ఎప్పుడు విడుదలవుతాయో..ఎప్పుడు జీతాలు పెరుగుతాయో అని కోటీ 20 లక్షలపైగా కార్మికులు కండ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. రాష్ట్రమొచ్చి ఎనిమిదేండ్లయినా.. ఖజానాపై పైసా భారం పడకున్నా జీవోలు సవరించకపోవడంతో రాష్ట్ర సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మన రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ ఉన్నాయి. పార్ట్-1 కింద 65, పార్ట్-2 కింద 8 షెడ్యూల్లున్నాయి. పార్ట్-1కింద ఉత్పత్తి, సర్వీసు సెక్టారులుండగా, పార్ట్-2 కింద వ్యవసాయ సంబంధ, అనుబంధ పరిశ్రమలున్నాయి. వాటిపై ఆధారపడి కోటీ 20 లక్షల మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో సుమారు కోటీ 20 లక్షల మంది పారిశ్రామిక, అసంఘటిత కార్మికులున్నారు. కనీస వేతనాల చట్టం-1948 ప్రకారం వారికి కనీసం ఐదేండ్లకోసారైనా వేతనాలను పెంచాలి. రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వేతన సవరణ జరిగింది. ఆ తర్వాత మళ్లీ జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నవంబర్‌లో కనీస వేతనాల సలహా మండలిని నియమించింది. కాలపరిమితి ముగియడంతో 2016లోనూ పునరుద్ధరించింది. కనీస వేతనాలను రూ.18 వేలకు పెంచాలని కోరుతూ బోర్డు 2015, 16, 17లలో తీర్మానాలు చేసి రాష్ట్ర సర్కారుకు పంపింది. ఆ తర్వాత 49 రంగాలకు సంబంధించిన ఫైళ్లను కార్మిక శాఖ సీఎం కార్యాలయానికి పంపగా మరో 23 రంగాలకు సంబంధించిన వాటిని తన వద్ద పెండింగ్‌లో పెట్టుకున్నది. సెక్యూరిటీ సర్వీసెస్, ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు, రోడ్లు, భవనాల నిర్మాణాలు, ప్రాజెక్టులు, డ్యామ్ నిర్మాణాలు, స్టోన్ బ్రేకింగ్, స్టోన్ క్రష్షింగ్ రంగాల్లోని కార్మికులకు రూ.18 వేల వేతనాన్ని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆ తర్వాత యజమానుల సంఘాలు(ఫిక్కీ, ప్యాప్సీ, తదితరాలు) గెజిట్లు రాకుండా మోకాలడ్డేశాయి. ఓ పక్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పోరాడుతున్నామని టీఆర్ఎస్ చెబుతున్నది. కానీ, విధానపరమైన విషయాల్లో కార్మికులను మోడీ సర్కారు ఏవిధంగా తొక్కిపెడుతున్నదో, కేసీఆర్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తున్నది. ఖజానాపై పైసా భారం పడకున్నా కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించటంలో రాష్ట్ర సర్కారు తాత్సారం చేస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కార్మికుల శ్రమదోపిడీ జరుగుతున్నది.
రాష్ట్రంలోని పరిశ్రమల్లో కాంట్రాక్టు లేబర్ పెద్ద ఎత్తున విస్తరించి ఉంది. ఉత్పాదక రంగంలో హైదరాబాద్ చుట్టూతానే ఐదు లక్షలకుపైగా కార్మికులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మౌలికసదుపాయాలు, ఇతర సౌకర్యాలతో ఏర్పడిన సెజ్‌లు, టీఎస్ఐసీసీ, టీశాక్స్, ఇతరత్రా స్పెషల్ జోన్లలో కార్మిక చట్టాలు వర్తింపజేయట్లేదు. ఆదిభట్ల ఎయిరోస్పేస్‌లో సంఘం పెట్టుకుంటామని చెప్పిన 100 మంది కార్మికులను యాజమాన్యం నిర్ధాక్షిణ్యంగా తొలగించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సిమెంట్, రైస్‌మిల్లు పరిశ్రమలు, కరీంగనగర్, ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు, భద్రాద్రి కొత్తగూడెంలో ఐటీసీ, ఇతరత్రా ప్రాంతాల్లో ఉన్న ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి తదితర పరిశ్రమల్లో ఎక్కడ చూసినా కాంట్రాక్టు, వలస కార్మికులే కనిపిస్తున్నారు. ఐటీసీ పరిశ్రమలో నూటికి 99 శాతం మంది కాంట్రాక్టు లేబరే. వారిలోనూ 60 నుంచి 70 శాతం దాకా బీహార్, యూపీ, బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, తదితర ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలసొచ్చినవారే ఎక్కువ. వారికి కనీసవేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్‌లు ఏవీ వర్తింపజేయట్లేదు. పైగా వారితో 12 నుంచి 14 గంటల పాటు గొడ్డుచాకిరీ చేయిస్తూ కనీసం గేటు బయట కూడా అడుగు పెట్టనీయడం లేదు. చిన్న రూముల్లో 20, 30 మందిని కుక్కుతూ పశువుల మాదిరిగా చూస్తున్న దుస్థితి నెలకొంది. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979 ప్రకారం వాళ్లకు దక్కాల్సిన హక్కులేవీ అమలు చేయట్లేదు. చనిపోయినా కనీసం పరిహారం ఇవ్వట్లేదు. పరిశ్రమల్లో యాంత్రీకరణ పెరిగిన తర్వాత పనిఒత్తిడి తీవ్రమైంది. అప్రెంటీస్లతో పనిచేయించుకునే విధానమే పరిశ్రమల్లో ఎక్కువగా నడుస్తున్నది. ట్రైనీల పేరిట, లాంగ్టర్మ్ట్రైనీలు, ఎగ్జిక్యూటివ్‌లు, ఇలా రకరకాల పేరుతో కార్మికులను నియమించుకుంటూ వారికి ఏడెనిమిది వేల జీతమే ఇస్తూ పరిశ్రమలు శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయి. పరిశ్రమల తీరును నిరసిస్తూ మూడేండ్ల నుంచి సీఐటీయూ ఒక ప్రణాళికా ప్రకారం ముందుకెళ్తున్నది. 2021లో కార్మిక గర్జన పేరుతో హైదరాబాద్ చుట్టూతా ఉన్న పరిశ్రమల మీదుగా పాదయాత్ర చేపట్టి కార్మికుల సమస్యలను సమాజం దృష్టికి తీసుకొచ్చింది. సమ్మెకు పిలుపునిస్తే ఐదులక్షల మందికిపైగా కార్మికులు సంఘాలకు అతీతంగా పాల్గొన్నారు. ఆగస్టు మూడో తేదీన ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తే 10 వేల మందికిపైగా కార్మికులు వచ్చారు.
కనీస వేతన జీవోలు విడుదల చేసేదాకా పోరాటాలు
భూపాల్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, కనీసవేతనాల సలహామండలి సభ్యులు
73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాల జీవోలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. వ్యాపారుల ప్రయోజనాలు, లాభాలు చేకూర్చిపెట్టడం తప్ప కోటీ 20 లక్షలకుపైగా పారిశ్రామిక, అసంఘటిత కార్మికుల జీతాల పెంపు పట్టదా?. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి. లేనిపక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తాం. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రమంతటా నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఇతర కార్మిక సంఘాలను కూడా కలుపుకుని ఐక్యకార్యాచరణతో ముందుకు సాగుతాం.