Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాదం, సరళీకరణ రెండూ దేశానికి ప్రమాదకరం : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్
నవ తెలంగాణ-సిద్దిపేట అర్బన్
'కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకని, మతోన్మాదం, సరళీకరణ రెండూ దేశానికి ప్రమాదకరకని, వాటి పర్యవసానాలపై రాష్ట్ర మహాసభల్లో చర్చించి భవిష్యత్ పోరాటాలను నిర్ణయిస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ తెలిపారు. ఈ నెల 21, 22, 23వ తేదీల్లో సిద్దిపేటలో నిర్వహించనున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సోమవారం మహాసభల సన్నాహక సమావేశం సందర్భంగా సిద్దిపేటలోని శివమ్స్ గార్డెన్లో ఏర్పాట్లు, రెడ్డి సంక్షేమ భవన్లో నిర్వహించనున్న మహాసభల ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాసభ ప్రాంగణానికి మల్లు స్వరాజ్యం, సున్నం రాజయ్య పేర్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి 600 మంది ప్రతినిధులు మహాసభకు హాజరుకానున్నట్టు చెప్పారు. మూడు రోజులపాటు కొనసాగే మహాసభలకు ఇతర కార్మిక సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నామన్నారు. చివరి రోజు 23వ తేదీ జరిగే భారీ బహిరంగ సభకు కేరళ కార్మిక శాఖ మంత్రి శివమ్స్ కుట్టి, ఆంధ్రప్రదేశ్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మహాసభలకు హాజరుకానున్నట్టు తెలిపారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు కూడా హాజరవుతారన్నారు. కార్మిక చట్టాలు, ధరల పెరుగుదల, విద్యుత్ చట్టం, రైతాంగ సమస్యలపై ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల కొత్త చట్టాన్ని సవరించి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు. బీఆర్ఎస్ జయప్రదం కావాలంటే కొన్ని సమస్యలు పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. మతోన్మాద బీజేపీపై పోరాటం చేయడానికి ఏర్పడ్డ బీఆర్ఎస్ ఆందోళనలకు భవిష్యత్తులో మద్దతు పోరాటాలు నిర్వహిస్తామన్నారు. మహాసభలకు సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, శశిధర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, ఆహ్వాన సంఘం కార్యదర్శి గోపాలస్వామి, అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షులు పద్మ తదితరులు పాల్గొన్నారు.