Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరునెలల్లోనే అత్యంత పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తి
- ఎంపికైనవారికి మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్య చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయింది. 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం ఆరు నెలల్లో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ పూర్తి చేసి తుది ఫలితాలు సోమవారం విడుదల చేసింది. వైద్య ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయడంలో భాగంగా ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా చూసేందుకు భర్తీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో 90 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనలో భాగంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసి, ఆరు నెలల లోపే భర్తీ చేసింది. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ (డీపీహెచ్, ఎఫ్‌డబ్ల్యు) పరిధిలో 734 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 209 పోస్టులు, ఐపీఎం పరిధిలో ఏడు పోస్టులు ఉన్నాయి. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చిన ఆరు నెలల్లోనే ఎంపిక ప్రక్రియ పూర్తిచేసింది. రాత పరీక్ష లేకుండా, నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం విశేషం. ఎంపిక ప్రక్రియ ప్రతి దశలోనూ అత్యంత పారదర్శకంగా సాగింది.
డీపీహెచ్, టీవీవీపీ, ఐపీఎం పరిధిలో 969 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్ 15వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,803 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి గత నెల తొమ్మిదిన ప్రాథమిక మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తమకు తెలియజేయాలని సూచిం చింది. అభ్యర్థుల పూర్తి వివరాలతో సమగ్ర జాబితాను వెబ్సైట్లో పొందు పరిచింది. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం గత నెల 20వ తేదీన రెండో మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. గత నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫి కేషన్‌ను నిర్వహించింది. 950 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ సోమవారం ఫలితాలను విడుదల చేసింది.
అత్యంత పారదర్శకంగా ఎంపిక
'మెడికల్ రిక్రూటర్మెంట్ బోర్డు 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సెలక్షన్ లిస్ట్ విడుదల చేసింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎంపిక ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధనలో ఇది మరో ముందడుగు. ప్రకియ పూర్తి పారదర్శకంగా, సాఫీగా పూర్తి చేసిన మెడికల్ రిక్రూట్మెంట్కి అభినందనలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించేందుకు ఎంపికైన మీకు స్వాగతం. శుభాకాంక్షలు.'
- మంత్రి హరీశ్ రావు.