Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి శిలాఫలకం ఏర్పాటుపై గొడవ
- నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్సీ పేరు కింది వరుసలో పెట్టడంపై పీఏసీఎస్ డైరెక్టర్ అభ్యంతరం
- ఒకరిపై మరొకరు దాడి
- పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదు
- ఆలస్యంగా వెలుగు చూసిన వైనం
నవతెలంగాణ-శాయంపేట
పెద్దమ్మ గుడి ఆలయ నిర్మాణ పనులకు ఏర్పాటుచేసిన శిలాఫలకంలో ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించిన మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పేరు కింది వరసలో పెట్టడంపై సిరికొండ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శిలాఫలకంలో ఎమ్మెల్సీ పేరు కింది వరసలో పెట్టడం పట్ల పీఏసీఎస్ డైరెక్టర్ బగ్గి రమేష్ స్థానిక సర్పంచ్ భర్త గోలి మహేందర్ రెడ్డితో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండగా, అదే గ్రామానికి చెందిన పెద్దమ్మగుడి చైర్మెన్ మూడేడ్ల పైడి జోక్యం చేసుకోవడంతో ఇరువురి మధ్య మాటమాట పెరిగి గొడవ పడ్డారు. ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఇరు గ్రూపులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పీఐసీఎస్ డైరెక్టర్ బగ్గి రమేష్ కథనం ప్రకారం.. మండలంలోని కొప్పుల గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి అప్పటి స్పీకర్ సిరికొండ మధుసూదన చారి రూ.10 లక్షల నిధులు కేటాయిం చారు. టెండర్లు కాకముందే మరలా ఎన్నికలు రావడం, సిరికొండ ఓటమి చెందడంతో పెద్దమ్మ గుడి నిర్మాణం గురించి పట్టించు కోలేదు. ఎమ్మెల్సీగా సిరి కొండ ఎన్నికవ్వడంతో పీఏసీఎస్ డైరెక్టర్ రమేష్ మరల ఎమ్మెల్సీ మధుసూద నాచారి వెంటపడి నిధులు తెప్పించగా ఇటీవల టెండర్లు పూర్తయ్యాయి. ఈనెల 18న భూమి పూజకు ముహూర్తం ఖరారు చేశారు. భూమి పూజ కోసం తయారు చేసిన శిలాఫలకంలో ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎమ్మెల్సీ సిరికొండ పేరు కింది వరుసలో ఉండటంతో డైరెక్టర్ రమేష్ సర్పంచ్ భర్తతో అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో కలగజేసుకున్న ఆలయ చైర్మెన్ పైడి రమేష్తో వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ తార స్థాయికి చేరుకొని కట్టెలతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో డైరెక్టర్ రమేష్ ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. పైడి కూడా గాయపడటంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఇరువురు స్థానిక పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా పెద్దమ్మ గుడి ఆలయ నిర్మాణానికి ఆదివారం ఉదయం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటర మణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. అదే రోజు రాత్రి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి కూడా పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఓకే ఆలయ నిర్మాణానికి ఇరువురు వేరువేరుగా భూమి పూజ చేయడం, వారి అనుచరుల మధ్య వర్గ విభేదాలు తార స్థాయికి చేరుకుంటున్నాయని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.