Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్గదర్శకాల త్రిసభ్య కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పాఠశాలల్లో పిల్లల భద్రత, రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ప్రకటించింది. సోమవారం హైదరాబాద్లో కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యా దేవరాజన్తో ఏర్పడిన త్రిసభ్య కమిటీ వివిధ భాగస్వాములతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ చిన్నారుల రక్షణ, భద్రత అందరి బాధ్యత అని అన్నారు. ఇకపై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి పటిష్ట మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు. అందుకు విలువైన సూచనలు, నిర్దిష్టమైన సలహాలను ఇవ్వాలని కోరారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో టెక్నాలజీ పరంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న క్రమంలో పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు వారి భద్రత, రక్షణ ఎంతో ముఖ్యమని చెప్పారు. వ్యవస్థీకృత చట్రంలో మార్గదర్శకాల రూపకల్పన ఉండాలని సూచించారు. అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా మాట్లాడుతూ ఏదైనా సంఘటన జరగకముందే మేల్కోవాలని కోరారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ పిల్లల రక్షణ, భద్రతను బాధ్యత గా భావించాలనీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా పోలీసుల సమన్వయంతో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. షీ టీమ్స్ డీఐజీ సుమతి మాట్లాడుతూ సైబర్ నేరాల సంఖ్య గణనీ యంగా పెరిగిందన్నారు. పిల్లలు ఫిర్యాదు చేసిన వెంటనే పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన మాట్లాడుతూ పిల్లల శ్రేయస్సు, రక్షణ అనేది సామాజిక బాధ్యతగా భావించి అందరూ భాగస్వాములు కావాలని కోరారు.