Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత నియోజకవర్గం వాళ్లకే పదవులు కట్టబెట్టడంపై ఆగ్రహం
- కేడర్, కార్యకర్తల కోసమే సమావేశమని ఎమ్మెల్యేల వివరణ
- ఎమ్మెల్యే మైనంపల్లి నివాసంలో సమావేశమైన ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్త గళం వినిపించారు. పదవులన్నింటినీ మంత్రి సొంత నియోజకవర్గానికి, అనుచరులకే ఇప్పించకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో సోమవారం ఉప్పల్ (బేతి సుభాష్‌రెడ్డి), కూకట్పల్లి(మాధవరం కృష్ణారావు), శేరిలింగంపల్లి (అరికెపూడి గాంధీ), కుత్బుల్లాపూర్ (వివేకానంద్) ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. దాదాపు నాలుగైదు గంటలపాటు వీరంతా చర్చించుకున్నారు. రహస్య భేటీపై లీక్ కావడంతో ఐదుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ సమావేశానికి ప్రత్యేక కారణం లేదంటూనే మంత్రి మల్లారెడ్డి వైఖరిని తప్పుబట్టారు. నామినేటెడ్ పదవులన్నీ మేడ్చల్ నియోజకవర్గానికి, అనుచరులకే ఇచ్చుకుంటున్నారని.. తమ నియోజకవర్గాల కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని సీఎం కేసీఆర్ పదేపదే చెప్పినా మంత్రి ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. వచ్చిన వాళ్లకే పదవులు వస్తున్నాయని.. ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో వ్యక్తి మూడు నాలుగు పదవులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలకు పదవులు రావాలనే తాము అడుగుతున్నామని, కొన్ని అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే మాట్లాడుతున్నామని మైనంపల్లి చెప్పుకొచ్చారు. కొందరు మంత్రులు వాళ్ల వ్యక్తులకే నాలుగు పదవులు ఇప్పించుకుంటున్నారని, నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు తమని నిలదీస్తున్నారని వివరించారు. మంత్రుల వ్యక్తులకే పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తమ సమస్యకు కారణమే మంత్రి మల్లారెడ్డి.. మళ్లీ ఆయన్ను ఎలా పిలుస్తామని చెప్పారు. కొత్త వ్యక్తులకు పదవులు ఇస్తే అభినందిస్తామన్నారు. సమావేశం అంతర్గత విషయాలు బయటకు వెళ్లాయని ఎమ్మెల్యే వివేకానంద చెప్పారు. తమపై పార్టీ వ్యతిరేక ముద్ర వేసేందుకు ఎవరో కుట్ర చేశారన్నారు. జిల్లా నాయకత్వం వైఫల్యాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.