Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సుశీల గోపాలన్ నిత్య పోరాట యోధురాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని వీరనారి ఐలమ్మ భవన్లో సుశీల గోపాలన్ 21వ వర్థంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి కెఎన్ ఆశాలతతో పాటు ఐద్వా నేతలు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ సుశీలగోపాలన్ మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని గుర్తుచేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారన్నారు. మూడు సార్లు పార్లమెంట్ సభ్యులుగా, కేరళ పీడీఎఫ్ ప్రభుత్వంలో పరిశ్రమలు, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారని గుర్తుచేశారు. మహిళల హక్కులు, చట్టాలు, సంస్కరణలు, వరకట్న నిర్మూలన వంటి అంశాలపై పార్లమెంట్లో చర్చకు వచ్చే విధంగా కృషి చేశారని తెలిపారు. జనవరిలో కేరళలో ఐద్వా జాతీయ 13వ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో జెండా అవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ భవనం ముందు ఐద్వా అధ్యక్షులు ఆర్ అరుణ జ్యోతి జెండా అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కె నాగలక్ష్మి, ఉపాధ్యక్షులు పి శశికళ, ఎం వినోద, రాష్ట్ర కమిటి సభ్యులు ఎ పద్మ, ఎమ్ స్వర్ణలత, స్వరూప,పద్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.