Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజుకు 2.3 లక్షల టన్నులు బొగ్గు తీయాలి
- సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాలనీ, అలాగే రోజుకు 16 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలని సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 70 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్య సాధనకు రాబోయే వంద రోజులు అత్యంత కీలకమైనవని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన బొగ్గు ఉత్పత్తి, రవాణాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏరియా జనరల్ మేనేజర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెలలో గడచిన 18 రోజులుగా సగటున 2.15 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అంతే పరిమాణంలో బొగ్గు రవాణా చేయగలిగామన్నారు. అలాగే రోజుకు 15.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించామన్నారు. భూ సేకరణ విషయంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో థర్మల్ కేంద్రాలకు నిరాటంకంగా బొగ్గు సరఫరా జరగాలనీ, నిర్దేశిత రేకులకు తగ్గకుండా రవాణా చేయాలని ఆదేశించారు. సమావేశంలో కొత్తగూడెం నుంచి డైరెక్టర్ (ఆపరేషన్స్, పర్సనల్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (పి అండ్ పి, ఫైనాన్స్) ఎన్. బలరామ్, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి. సత్యనారాయణరావు, జీఎం(సీపీపీ) సీహెచ్ నర్సింహారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అడ్వయిజర్ (మైనింగ్) డి.ఎన్. ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె ఆల్విన్, జీ.ఎం. (కో ఆర్డినేషన్) ఎం సురేష్, జీఎం (మార్కెటింగ్) కే సూర్యనారాయణ హాజరయ్యారు.