Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు కూడా రమ్మన్నారు : ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
- ఆరు గంటల పాటు విచారించిన ఈడీ
- ఆస్తులు, వ్యాపారాల పైనే ఎక్కువగా దృష్టి
- 31 వరకు గడువు కావాలన్నా పట్టించుకోని అధికారులు
- విచారణ ప్రారంభానికి ముందు నాటకీయ పరిణామాలు
- నేడు కూడా విచారణ కొనసాగింపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని నాటకీయ పరిణామాల మధ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ఆరుగంటల పాటు విచారించారు. నేడు (మంగళవారం) కూడా విచారణకు రావాలని ఆయనను ఆదేశించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈడీ అధికారులు, ఎమ్మెల్యేల మధ్య కొంత నాటకీయ పరిణామాలు నెలకొనగా అటుతర్వాతే ఎమ్మెల్యే విచారణ పర్వం మొదలైంది. 19న ఉదయం 10.30 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఈనెల 16న ఈడీ అధికారులు రోహిత్‌రెడ్డికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో మణికొండలోని తన నివాసం నుంచి బయలుదేరిన రోహిత్‌రెడ్డి నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్తున్నట్టు అందరూ భావించారు. అయితే, మార్గ మధ్యలో తన పీఏ శ్రవణ్‌కు ఒక లేఖ అందించి ఈడీ అధికారులకు అందజేయాలని తెలిపి పంపిన రోహిత్‌రెడ్డి.. తాను మాత్రం నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎం కేసీఆర్‌తో రోహిత్‌రెడ్డి సమావేశం దశలోనే ఈడీ కార్యాలయానికి చేరుకున్న శ్రవణ్.. ఎమ్మెల్యే తరఫు లెటర్‌ను అందజేశారు. అనంతరం ఈడీ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని శ్రవణ్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఈ రోజు విచారణకు రోహిత్‌రెడ్డి రాకపోవచ్చని అందరూ భావించారు. అయితే, శ్రవణ్ నుంచి సమాచారం అందుకున్న రోహిత్‌రెడ్డి దాదాపు 12 గంటల ప్రాంతంలో ప్రగతి భవన్ నుంచి వెలుపలికి వచ్చి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. విచారణకు హాజరు కావడానికి తనకు కొంత గడువు కావాలంటూ రోహిత్‌రెడ్డి పంపిన లేఖను ఈడీ అధికారులు తోసిపుచ్చి 3 గంటల సమయంలో తప్పనిసరిగా హాజరు కావాలని ఎమ్మెల్యేకు సమాచారం పంపినట్టు తెలిసింది. దీంతో రోహిత్‌రెడ్డి కోరిన విధంగా ఈడీ అధికారులు గడువు ఇస్తారని కొంత ఊహాగానాలు సాగినప్పటికీ దానికి తెరదించుతూ కచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని రోహిత్‌రెడ్డిని ఈడీ కోరింది. దీంతో మధ్యాహ్నం 3.15 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి రోహిత్‌రెడ్డి చేరుకున్నారు. తాను అయ్యప్ప దీక్షలో ఉన్న కారణంగా ఈనెల 31 వరకు విచారణకు హాజరు కాలేనని దీక్ష ముగించుకున్న తర్వాత హాజరు కావడానికి అనుమతినివ్వాలంటూ తాను లేఖలో కోరినప్పటికీ.. ఈడీ అధికారులు అనుమతించలేదని అక్కడ ఉన్న మీడియాతో రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.అసలు ఏ కేసుకు సంబంధించి తనను విచారస్తున్నారో కూడా తనకు తెలియదంటూ ఆయన లోనికి వెళ్లిపోయారు. అప్పటి నుండి దాదాపు ఆరు గంటల పాటు విచారణలో పాల్గొని రాత్రి 9.15 గంటల ప్రాంతంలో రోహిత్‌రెడ్డి వెలుపలికి వచ్చి కొంత సేపు మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ఎందుకు ఈడీ అధికారులు విచారణకు పిలిపించారో ఇప్పటికీ అర్థం కావటం లేదనీ, మంగళవారం కూడా ఉదయం 10.30 గంటల ప్రాంతంలో విచారణకు హాజరు కావాలని అధికారులు తెలిపారని ఎమ్మెల్యే అన్నారు. తనను కేవలం తన బయోడేటా గురించి అడిగారని తెలిపారు. అయితే, తనను ఏకేసులో, ఎవరి ఫిర్యాదు మేరకు, ఎందుకు విచారిస్తున్నారని అధికారులను అడగగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని రోహిత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కూడా విచారణకు తప్పక రావాలంటూ పంపించాలని అన్నారు. బ్యాంకు అకౌంట్లు, ఖాతాలతో పాటు ట్యాక్స్ చెల్లింపులు, వ్యాపారాల వివరాలను వెంట తీసుకురమ్మన్నారని ఆయన తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను ఈడీ ఇచ్చిన నోటీసుకు స్పందించి విచారణకు వచ్చాననీ, మంగళవారం కూడా నిర్ణీత సమయానికి హాజరవుతానని రోహిత్‌రెడ్డి తెలిపారు. కాగా, దాదాపు ఆరు గంటల పాటు ఈడీ అధికారులు ఏ కోణంలో విచారించారన్న విషయం గోప్యంగానే ఉంచారు. ఈడీ అధికారులు రోహిత్‌రెడ్డికి సంబంధించి ఆస్తులు, వ్యాపార లావాదేవీల పైనే ఎక్కువగా దృష్టిని సారించినట్టు తెలిసింది.