Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి ఒకటి వరకు కొనసాగింపు: జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నేషనల్ 35వ బుక్ ఫెయిర్‌ను ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు నిర్వహించనున్నట్టు ఆ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బుక్ ఫెయిర్‌కు మీడియా సహకారం అందించాలని కోరారు. గతేడాది కేవలం 11 రోజుల్లో 10 లక్షల మందికి పైగా సందర్శించడమనేది పుస్తకాల పట్ల ప్రజలకున్న ఆసక్తికి నిదర్శనమన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది...రాష్ట్రంలోని 33 జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి క్షూడా చదువరులను ఆకర్షిస్తున్నదని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, కుటుంబ సమేతంగా రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం బుక్ ఫెయిర్ నిర్వహణకు ఎన్టీఆర్ స్టేడియంను ఉచితంగా ఇవ్వడమే కాకుండా స్టాల్స్ నిర్మాణం, ఖర్చుల కోసం కూడా నిధులను కేటాయిస్తోందని తెలిపారు. ఫెయిర్ నిర్వహణ వరకే తమ బాధ్యులమనీ, అమ్మకాలు-కొనుగోలు అంతా ఆయా ప్రచురణకర్తలే స్వయంగా చూసుకుంటారని స్పష్టం చేశారు. ఈ ఏడాది 340 స్టాల్స్ రాగా, అందులో ప్రత్యేకంగా రచయితలే నేరుగా అమ్ముకునేందుకు చిన్న స్టాల్స్ ఉంటాయని తెలిపారు. వీటితో పాటు అదనంగా 'మన ముఖ్యమంత్రి' స్టాల్ ఉంటుందని వెల్లడించారు. ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయ్యారనీ, ఆ క్రమంలో కేసీఆర్‌పై అనేక పుస్తకాలు వచ్చాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయాశాఖల ద్వారా చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఆ డిపార్ట్ మెంట్లు ఏర్పాటు చేసే స్టాల్స్ కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. ప్రతి రోజు సాయంత్రం నిర్వహించే సాంస్కతిక కార్యక్రమాలు పిల్లలను, పెద్దలను అలరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవం సందర్భంగా తొలిరోజు మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ప్రతి రోజు ఒక మంత్రి బుక్ ఫెయిర్‌కు రావడం ఆనవాయితీగా వస్తున్నదని గుర్తుచేశారు. జర్నలిస్టులు, విద్యార్థులకు ఉచిత పాసులతో ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. బుక్ ఫెయిర్‌లో ప్రాంగణాలకు ఒగ్గు కథ మిద్దె రాములు, అనిశెట్టి ప్రభాకర్ పేర్లు పెట్టనున్నట్టు గౌరీశంకర్ తెలిపారు. ఈ సమావేశంలో బుక్ ఫెయిర్ కార్యదర్శి సృతికాంత్ భారతి, ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్, కోశాధికారి రాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు.