Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 4 వరకు నిర్వహణ
- ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్స్
- షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వార్షిక పరీక్షలు-2023, మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జరుగుతాయి. జనరల్‌తోపాటు ఒకేషనల్ విద్యార్థులకూ ఇదే షెడ్యూల్ వర్తించనుంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జరగనున్నాయి. వచ్చేఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి రెండో తేదీ వరకు ఇంటర్మీడియెట్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ప్రతి రోజూ రెండువిడతల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండో విడత ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం పరీక్షల షెడ్యూల్ (టైంటేబుల్)ను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చేఏడాది మార్చి నాలుగో తేదీన నైతికత, మానవ విలువలు రాతపరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.