Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీల ధర్నా
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఆన్లైన్లో రికార్డులు నమోదు పేరిట వేధింపులు మానుకోవాలని, ఆన్లైన్ రిపోర్టింగ్ విధానం రద్దు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్ప్‌ర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేశ్‌బాబు మాట్లాడారు. అంగన్వాడీలకు ఇచ్చే వేతనం తక్కువైనప్పటికీ అదనపు పనులను మాత్రం విపరీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయించుకుంటూ అదనపు వేతనం ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని విమర్శించారు. 40 ఏండ్లుకు పైగా పనిచేస్తున్న అంగన్వాడీలకు ఇంగ్లీష్ రాకపోయినా.. రోజువారీ పిల్లల అటెండెన్స్ వివరాలతో పాటు ఫీడింగ్ వివరాలు, ఇతర విషయాలను ఆన్లైన్లోనే ప్రభుత్వం సూచించిన యాప్‌లలో రిపోర్టులు పంపాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో బయట రిపోర్టులు చేయించడానికే వారి సగం వేతనం వెచ్చించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ఆన్లైన్ విధానం కాకుండా ఇప్పటికే 14 రకాల రికార్డులను రిపోర్ట్ రాస్తూ ఇస్తున్నారని, దాంతో పాటు అదనపు పనులతో అంగన్వాడీలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆన్లైన్లో రిపోర్టింగ్ విధానం రద్దు చేయాలని, లేకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చచించారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవగంగు, పి స్వర్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు చంద్రకళ, సిఐటియు జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, అంగన్వాడీలు పెద్దఎత్తున పాల్గొన్నారు.