Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సి.హెచ్. మల్లారెడ్డి
- వనపర్తి చరిత్రలో సుదినం:మంత్రి సబిత
- బీసీలు విద్యావకాశాలను వినియోగించుకోవాలి : మంత్రి గంగుల
- విద్యాహబ్‌గా వనపర్తి అభివృద్ధి : మంత్రి నిరంజన్ రెడ్డి
నవ తెలంగాణ - వనపర్తి
అబద్దాలతో బీజేపీ ఎనిమిదన్నరేండ్లుగా దేశ ప్రజలను మోసం చేస్తోందని, అయితే, ఇంకో ఏడాదిన్నర అయితే బీజేపీ పీడ విరగడ అవుతుందని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సిహెచ్. మల్లారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీసీ సంక్షేమ, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మంత్రి సి.హెచ్.మల్లారెడ్డి, ఎంపీ పోతుగంటి రాములుతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జెఎన్టీయూ కళాశాల, పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాల, ఐటీఐ. కళాశాల, బీసీ రెసిడెన్షియల్, వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవాలు, జెఎన్టీయూ వసతి గృహ నిర్మాణానికి శంకస్థాపనలు చేశారు. అనంతరం బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయానన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు తెచ్చి వనపర్తిని అభివృద్ధి ముందుంచారన్నారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా చరిత్రలో ఇది సుదినమని చెప్పారు. మంత్రి నిరంజన్‌రెడ్డి ఏది మాట్లాడినా దాని వెనుక ప్రజల ప్రయోజనం ఉంటుందన్నారు. బీసీ మహిళా డిగ్రీ కళాశాలలో వ్యవసాయ కోర్సు ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయడం మూలంగానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో 1153 జూనియర్ గురుకుల కళాశాలలు ఉన్నాయన్నారు. రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చి విద్యార్థులను చదివిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. జిల్లాకు నీళ్లు తెచ్చి నీళ్ల నిరంజన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు.. ఇన్ని విద్యా సంస్థలు తెచ్చినందుకు ఇంకో పేరు పెట్టాలని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా ఇన్ని విద్యాసంస్థలు ఏర్పాటు చేయలేదన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలి మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలను వనపర్తిలో ఏర్పాటు చేశామన్నారు. చదువులో బీసీలు వెనకబడలేదు.. వెనకబడేయబడ్డారని చెప్పారు. దేశంలో ప్రథమంగా డిగ్రీ గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కోర్సులను ఈ డిగ్రీ కళాశాలలల్లో ప్రవేశపెట్టామన్నారు.
మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు, రహదారుల విస్తరణ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులు ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.
అందుకే మహిళా బీసీ గురుకుల కళాశాలలో ప్రత్యేకంగా వ్యవసాయ విద్యను బోధించడం జరుగుతుందన్నారు. వనపర్తి వ్యవసాయ కళాశాల కోసం 70 ఎకరాల భూమి అవసరమని, మొదటిదశలో 35 ఎకరాల్లో ప్రారంభించామన్నారు. మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్ తదితర విద్యాసంస్థల కోసం అక్రమార్కుల చేతుల్లో ఉన్న ప్రభుత్వభూమిని వెనక్కి తీసుకున్నామని చెప్పారు. వనపర్తిలో వివిధ విద్యాసంస్థల ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, మంత్రి గంగుల కమలాకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మెన్ సాయిచంద్, జడ్పీ చైర్మెన్ లోక్‌నాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, ఎస్పీ అపూర్వ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు, రిజిష్ట్రార్ సుధీర్ కుమార్, జడ్పీ వైస్ చైర్మెన్ వామన్ గౌడ్ , మార్కెట్ చైర్మెన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మెన్ గట్టు యాదవ్, వైస్ చైర్మెన్ వాకిటి శ్రీధర్, జిల్లా అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.