Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకులు, యాజమాన్యాల ముప్పేట దాడి
- కార్మికవర్గ ఐక్యత కోసం కృషి
- కనీస వేతనాల జీవోల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ
- ప్రత్యామ్నాయ విధానాల కోసం కార్మికుల్లో రాజకీయ చైతన్యం : నవతెలంగాణతో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక కోడ్ల ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండబోతున్నది?
లేబర్కోడ్లు కార్మికులను కట్టుబానిసలుగా మార్చబోతున్నాయి. పైకి వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తి సంబంధిత రక్షణ, ఆరోగ్యపని పరిస్థితులనేవి చూడటానికి మంచి పేర్లుగా కనిపిస్తున్నప్పటికీ లోపల కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాసే కుట్ర ఉంది. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడితో అనేక రాష్ట్రాలు ఆ కోడ్లకు డ్రాప్టు రూల్స్ తయారుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అమల్లోకి తెచ్చాయి. మన రాష్ట్రంలోనూ కార్మిక శాఖ ముసాయిదా రూల్స్ విడుదల చేసింది. ఇవి అమల్లోకి రాకముందే కొన్ని పరిశ్రమలు 12 గంటల పనివిధానాన్ని అమలు చేస్తున్నాయి. ఆ కోడ్లే అమల్లోకి వస్తే కార్మికుల బతుకులు రోడ్డునపడే ప్రమాదముంది. ఇప్పటికే చాలా కంపెనీలు యూనియన్లను పెట్టుకోవడానికి నిరాకరిస్తున్నాయి. సమ్మెలపై నిషేధం విధిస్తున్నాయి. ఇచ్చే అరకొర వేతనాల్లోనూ కోతలు పెడుతున్నాయి. వలస కార్మికులను ప్రోత్సహిస్తున్నాయి.వారికి ఏ కార్మిక చట్టం కూడా అమలు చేయడంలేదు. ఈ పరిణామాలన్నీ కార్మికులను కట్టుబానిసలుగా చేయడంలో భాగంగా జరుగుతున్నవే. అణచేకొద్దీ కార్మిక పోరాటాలు తీవ్రమవుతాయి.
రాష్ట్రంలో కార్మికుల స్థితిగతులేంటి?
రాష్ట్రంలో దాదాపు కోటిన్నర మంది కార్మికులున్నారు. వారిలో పర్మినెంట్ ఉద్యోగులు నామమాత్రమే. ఎక్కువగా కాంట్రాక్టు, క్యాజువల్, ట్రైనీ, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీమెంట్, పీస్‌రేటు, లాంగ్‌టర్మ్ అప్రెంటీస్, తదితర పేర్లతో కార్మికులు పనిచేస్తున్నారు. వారికి కార్మిక చట్టాలు అమలు చేసేందుకు కార్పొరేట్లు నిరాకరిస్తున్నారు. ఫార్మా, ల్యాబ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, గార్మెంట్స్, తదితర రంగాల్లో 60 శాతానికిపైగా మహిళా కార్మికులే పనిచేస్తున్నారు. యాజమాన్యాలు వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రభుత్వ పథకాల్లో పనిచేసేవారిలోనూ మహిళలే ఎక్కువ. వారికి గౌరవవేతనం తప్ప వారికంటూ ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఆర్టీసీ, ప్రయివేటు ట్రాన్స్పోర్టురంగంలో కార్మికులపై తీవ్ర అణచివేత కొనసాగుతున్నది. వీఆర్ఏ, సింగరేణి కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు.
రాష్ట్రంలో కనీసవేతనాల జీవోల జారీ కోసం సీఐటీయూ స్వతంత్రంగా, ఇతర సంఘాలతో కలిసి ఐక్యంగా చేస్తున్న పోరాటాలేంటి?
రాష్ట్రంలో అనేక పోరాటాల తర్వాత ఐదు రంగాల కనీస వేతనాల సవరణ జరిగింది. కానీ, యాజమాన్యాల ఒత్తిడికి లొంగి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్లు విడుదల చేయకుండా నాన్చుతున్నది. దీనిపై ఇతర ట్రేడ్ యూనియన్లతోనూ, స్వతంత్రంగానూ అనేక పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటికే క్షేత్రస్థాయిలోకి వెళ్లి కార్మికుల్లో దీనిపై చర్చనీయాంశం చేశాం. హైదరాబాద్ చుట్టూ 450 కిలోమీటర్లు చేపట్టిన సీఐటీయూ కార్మికగర్జన యాత్ర, ఇతర పారిశ్రామిక వాడల్లో జీపుజాతాలు సక్సెస్ అయ్యాయి. వాటిద్వారా కార్మికులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమాజ దృష్టికి తీసుకొచ్చాం. వలసకార్మికులు దోపిడీకి గురవుతున్న తీరును ఎండగట్టాం. హక్కుల కోసం వారు పోరాటాల్లోకి క్రమంగా వచ్చేలా చేయడంలో కొంతమేర విజయవంతం అయ్యాం. ఈ కృషి మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. అక్టోబర్ 8 సమ్మె, హైదరాబాద్‌లో మహాప్రదర్శన విజయవంతం అవ్వటమే కార్మికులు దోపీడీకి, అణచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వస్తున్నారనే దానికి సంకేతం. కనీస వేతనాల జీవోల జారీ కోసం ఈ ఏడాదీ నిర్ధిష్ట కార్యాచరణ తీసుకుని ప్రభుత్వ మెడలు వచ్చి విజయం సాధించేదాకా పోరుబాట విడవబోం.
పాలకులు కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొస్తూనే ఉన్నారు...చివరకు వారికే ఓట్లు వేస్తున్న పరిస్థితి ఉంది. కార్మికవర్గ ఐక్యత, రాజకీయ చైతన్యం కల్పించేందుకు సీఐటీయూగా మీరు ఇటీవలి కాలంలో ఏమైనా చేశారా?
ఇది వాస్తవమే. దీనిపై సుధీర్ఘంగా చర్చించి చెన్నై మహాసభలోనే ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాం. సాధారణ కార్మికులు ఎదుర్కొంటున్న వేతన సమస్య, ఉద్యోగ, సామాజిక భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సకల సమస్యలకు పాలకులు అనుసరిస్తున్న విధానాలే మూలకారణం. ఈ విధానాలను అమలుచేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాన శత్రువు. కార్మికుల సమస్యలు, ప్రభుత్వ విధానాలకు ఉన్న లింకును, ఆవిధానాల వెనుక ఉన్న వర్గ రాజకీయాలను కార్మికులకు అర్ధం చేయించడంలో కార్మిక ఉద్యమం వైఫల్యం చెందుతున్నది. సమస్యల పరిష్కారం కోసం పోరాటాల్లో కలిసివస్తున్న కార్మికులు అక్కడ వరకే పరిమితమై ఆలోచిస్తున్నారు. ఆ సమస్య పరిష్కరించబడితే చాలనుకుంటున్నారు. జీతం, జీవితం, రాజకీయం వేర్వేరు అని భావిస్తున్నారు. ఫలితంగానే మీరు అడిగిన పరిస్థితి ఉంది. కార్మికులను ఆర్థిక పోరాటాలకే పరిమితం చేయడం విప్లవకర ట్రేడ్‌యూనియన్ల లక్షణం కాదు. కార్మికులకు రాజకీయ చైతన్యం కూడా అవసరం. అప్పుడే కార్మికులు చైతన్యం అవుతారు. పాలకుల విధానాలను అర్థం చేసుకుని తమకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలపై పోరాటాల్లోకి వస్తారు. ప్రత్యామ్నాయ విధానాల కోసం కొట్లాడుతారు. పెట్టుబడిదారీ, నయా, ఉదారవాద విధానాలను ఓడించే శక్తి కార్మికవర్గానికి ఉందనీ, విశాల ఉద్యమాల ద్వారా అది సాధ్యం అవుతుందనే కార్మికవర్గంలో కల్పించాలి. అందుకు సీఐటీయూ నడుం బిగించి ముందుకు సాగుతున్నది.
భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?
తాత్కాలిక ప్రయోజనాల ఆశచూపి, ప్రలోభాలకు గురిచేసి కార్మికుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం అన్ని రంగాల్లోనూ జరుగుతున్నది. ఐక్య, స్వతంత్ర పోరాటాల ద్వారా దీన్ని తిప్పికొట్టాల్సిన గురుతర బాధ్యత సీఐటీయూపై ఉంది. శ్రామిక మహిళల సమస్యలు, స్కీమ్ వర్కర్లు, ఇతర కార్మికవర్గానికి జరుగుతున్న అన్యాయాలపై ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు సాగుతాం. ప్రతి కార్మికునికీ చేరువయ్యేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికులకు కనీస వేతనాల జీవోల జారీపై ఐక్య, స్వతంత్ర పోరాటాలను తీవ్రతరం చేస్తాం. ప్రత్యామ్నాయ సంస్కృతిని మరింత విస్తరింపజేస్తాం. కార్మికుల్లో రాజకీయ చైతన్యం కల్పించే దిశగా ముందుకుసాగుతాం.