Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ రాజకీయాలపై చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ మంగళవారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు విచ్చేసిన మాన్కు కేసీఆర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిరువురూ దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో ప్రగతి, పంజాబ్ పాలన తదితరాంశాలపై ముచ్చటించారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన కేసీఆర్‌ను...పంజాబ్ సీఎం ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు జోగినేపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
క్రిస్మస్ తర్వాత బీఆర్ఎస్కు మరింత ఊపు
- నెలాఖరు నాటికి ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్స్
- పలు భాషల్లో పాటలు, సాహిత్యం
- ఆంధ్రా నుంచి కూడా సంప్రదింపులు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకలాపాలు డిసెంబర్ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. టీఆర్ఎస్ పేరును మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల అధికారికంగా సమాచారం వచ్చిన వెంటనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఆ వెంటనే సీఎం ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి విదితమే. హస్తినలో ఆయన్ను అఖిలేష్ యాదవ్, కుమార స్వామి వంటి మాజీ సీఎంలు, ప్రముఖ పార్టీల అధ్యక్షులు కలిసిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, పలు సామాజిక వర్గాల సంఘాల నేతలు, పలు రంగాలు, వృత్తులకు చెందిన మేధావులు, యువతీ యువకులు సీఎంతో భేటీ అయ్యారు. మరోవైపు ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్‌లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు పూర్తి చేసి... ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలను వేగిర పరచాలంటూ పార్టీ శ్రేణులను ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లోని భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, నేపథ్యాలను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎలాంటి విధానాలను అవలంభించాలనే అంశాలపై కేసీఆర్... ఆయా శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. నెలాఖరు నాటికి పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా సహా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ కిసాన్ సెల్‌లను ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు కూడా ఆయన్ను కలిసినట్టు తెలిసింది. వారితో సీఎం చర్చలు, సమాలోచనలు సైతం జరిపారు. ఆయనతో భేటీ అనంతరం ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆంధ్రాలో బీఆర్ఎస్ కిసాన్ సెల్ ఏర్పాటు కానుంది.
నెలాఖరులో ఢిల్లీలో మీడియా సమావేశం...
ఈనెలాఖరులో కేసీఆర్ మరోసారి ఢిల్లీ విమానమెక్కనున్నారు. అక్కడ జాతీయ స్థాయిలో మీడియా సమావేశాన్ని ఆయన నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణ, విధి విధానాలను ఆయన ప్రకటించనున్నారు.