Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే పరిశ్రమలను మూసేయండి
- చెరువులు, మూసీ నదిలోకి మురుగు నీరు చేరకుండా చర్యలు: పీసీబీ సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలనీ, ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే పరిశ్రమలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. మురుగు నీటి శుద్దీకరణకు ఎస్టీపీలను, పారిశ్రామికవాడల్లోనూ కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)లను నెలకొల్పి అంతర్జాతీయ స్థాయిలో కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించేలా చూడాలని పీసీబీకి స్పష్టం చేశారు. పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలని సూచించారు. మంగళవారం అరణ్యభవన్‌లో ఎస్టీపీ, సీఈటీపీల ఏర్పాటు, జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ-నివారణ, ప్రతామ్నాయ మార్గాల అన్వేషణ, కాలుష్య కారక పరిశ్రమలపై తీసుకుంటున్న చర్యలపై పీసీబీ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, పీసీబీ సీఈ రఘు, ఎస్ఈఎస్ డి.ప్రసాద్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని రకాల కాలుష్య కారకాలు, నియంత్రణకు పీసీబీ తీసుకుంటున్న చర్యలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మంత్రికి వివరించారు. పట్టణాలు, నగరాల్లోంచి వెలువడుతున్న మురుగు నీరు నేరుగా నదులు, కాలువల్లో కలువకుండా పీసీబీ ప్రత్యేక దృష్టి పెట్టి మురుగు నీటి శుద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. రూ. 3,866 కోట్ల అంచనా వ్యయంతో 1259 ఎంఎల్ డీ మురుగునీటిని శుద్ధి చేసేందుకు 31 ఎస్టీపీల నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. వాటి నిర్మాణం పూర్తయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వంద శాతం మురుగు నీరు శుద్ధి అయ్యే అవకాశం ఉందనీ, దీంతో మూసీ నదితో పాటు చెరువులు, కుంటల్లో మురుగునీరు చేరే అవకాశం ఉండదని మంత్రికి తెలిపారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి కారణమవుతున్న 12 స్టోన్ క్రషర్స్ సీజ్ చేసి, జరిమానా విధించినట్టు వివరించారు. చౌటుప్పల్, సూర్యాపేట్ ప్రాంతాల్లో రసాయన (ద్రవ), ఘన వ్యర్ధాలను నీటి వనరుల్లో పారబోస్తూ జల కాలుష్యా నికి కారణమవుతున్న 10 పరిశ్రమలపై చర్యలు తీసు కుంటున్నట్టు తెలిపారు. రాంకీ సంస్థ ఆద్వర్యంలో నీటి శుద్ది కోసం ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నా రనీ, దానివల్ల వల్ల వ్యర్ధ జలాల వల్ల చెరువులు, భూగర్బ జలాల కాలుష్యాన్ని నియంత్రిస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ- వెహికల్ ఫాలసీని ప్రవేశ పెట్టడంతో పాటు పర్యావరణహిత వాహనాలను వాడేలా వాహనదారులను ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇస్తున్నట్టు చెప్పారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రహదారుల అభివృద్ధి 216 రహదారులకు బ్లాక్ టాపింగ్ చేశామని తెలిపారు.