Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది జిల్లాల్లో గర్భిణీలకు పంపిణీ చేయనున్న ప్రభుత్వం
- వర్చువల్గా ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నేటి నుంచి మొదలు కానున్నది. తొమ్మిది జిల్లాల్లోని గర్భిణీలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.50 కోట్లను కేటాయించింది. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వర్చువల్ పద్ధతిలో వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రారంభించనున్న కిట్ల పంపిణీకి సంబంధించి ఆయా ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. అత్యధిక ఎనిమియా (రక్తహీనత) అధికంగా ఉన్న ఆదిలాబాద్ (72 శాతం), కుమ్రంభీం ఆసిఫాబాద్ (83 శాతం), భద్రాద్రి కొత్తగూడెం (75 శాతం), ములుగు (73 శాతం), జయశంకర్ భూపాలపల్లి (66 శాతం), వికారాబాద్ (79 శాతం), నాగర్ కర్నూల్ (73 శాతం), జోగులాంబ గద్వాల (82 శాతం), కామారెడ్డి ( 76 శాతం) జిల్లాల్లోని గర్భిణీలకు కిట్లను అందజేయనున్నారు. ఈ జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 1.25 లక్షల మంది గర్భిణీలకు 2.50 లక్షల కిట్లను ఇవ్వనున్నారు. ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనతను తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రిషన్ కిట్ల లక్ష్యం. ఇందులో భాగంగా రూ.1,962 విలువ కలిగన కిట్లను 13 నుంచి27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ పరీక్షల సమయంలో మొదటి సారి, 28 నుంచి 34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ పరీక్షల సమయంలో రెండో సారి గర్భిణులకు ఇస్తారు. న్యూట్రిషన్ కిట్లో కిలో న్యూట్రిషషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ మూడు బాటిళ్లు, 500 గ్రాముల నెయ్యి, ఆల్ బెండ్ జోల్ టాబ్లెట్, కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ ఉంటాయి. కేసీఆర్ కిట్ పథకం అమలుకు ముందు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు 30 శాతంగా ఉండగా ప్రస్తుతం 66 శాతానికి పెరిగింది. న్యూట్రిషన్ కిట్లు గర్భిణీలకు వరంగా మారనుండటంతో ఈ ప్రసవాల శాతం మరింత పెరుగుతందని వైద్యారోగ్యశాఖ భావిస్తున్నది.
తల్లి బాగుంటేనే ఇల్లు బాగుంటుంది:మంత్రి హరీశ్ రావు
'తల్లి బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. పిల్లలు బాగుంటే భావితరాలకు బాగుంటుంది. అందుకే తల్లీ, బిడ్డ సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పథకాలు ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేసీఅర్ న్యూట్రిషన్ కిట్ పౌష్టికాహారాన్ని అందించి తల్లి, బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందించనుంది. మాతా, శిశు సంరక్షణ కోసం మనం తీసుకుంటున్న చర్యలు ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని మరింత చేరువ చేస్తున్నాయి.