Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి 43 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలుకు అంగీకారం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి త్వరలోనే బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థ దామోదర్ వ్యాలీ కార్పోరేషన్, సింగరేణి నైనీ బొగ్గు బ్లాక్నుంచి ఏడాదికి 43 లక్షల టన్నుల బొగ్గును కొనుగోలు చేయడానికి పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జే అల్విన్ సమక్షంలో సింగరేణి జీఎం(మార్కెటింగ్) కే సూర్యనారాయణ, దామోదర్ వ్యాలీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంధన శాఖ) తరుణ్ కుమార్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ నైనీ బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు కొనుగోలుకు వివిధ రాష్ట్రాల్లోని ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్లు, తమిళనాడు జెన్కో ఆసక్తి చూపుతున్నాయనీ, త్వరలోనే వీరితో కూడా బొగ్గు సరఫరా ఒప్పందం చేసుకోనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీజీఎంలు ఎన్.వి.రాజశేఖరరావు, తాడబోయిన శ్రీనివాస్, సత్తు సంజరు, ఎస్వోఎం సురేందర్ రాజు, అడిషనల్ మేనేజర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.