Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.92లక్షలు పొగొట్టుకున్న డిగ్రీ విద్యార్థి
నవతెలంగాణ-షాబాద్
ఆన్లైన్ గేమ్ కింగ్ 567 క్యాసినో ఆడి ఓ డిగ్రీ విద్యార్థి రూ.92లక్షలు పొగొట్టుకున్నాడు. విద్యార్థి అమాయకత్వానికి సైబర్ కేటుగాళ్లు ఆసరాగా తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన చన్వెల్లి శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మికు ఇద్దరు సంతానం, వ్యవసాయ కుటుంబం. పెద్ద కుమారుడు శ్రీపాల్‌రెడ్డి బీటెక్ చదువుతుండగా, చిన్న కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
వీరికి వంశపారపర్యంగా సీతారాంపూర్‌లోని సీతారామచంద్ర స్వామి దేవాలయానికి చెందిన 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని సాగు చేసుకుంటూ గ్రామంలోనే ఉంటూ పిల్లలను ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ పంపారు. గతేడాది సీతారాంపూర్ గ్రామానికి చెందిన దేవాలయం భూములను తెలంగాణ రాష్ట్ర ఇండిస్టీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ ఐఐసీ) ఎకరానికి రూ.10.50 లక్షల చొప్పున రైతులకు ఇచ్చి గ్రామంలోని భూమిని సేకరించారు. ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డికి చెందిన బ్యాంక్ ఖాతాలో రూ.42.50 లక్షలు, విజయలక్ష్మి ఖాతాలో రూ.42.50లక్షలు అధికారులు జమా చేశారు. అయితే శంషాబాద్ మండలం మల్లాపూర్ గ్రామంలో అర ఎకరం భూమిని రూ.70లక్షలకు ధర చేసి, రూ.20లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. మల్లాపూర్‌లో కొనుగోలు చేసిన భూమికి డబ్బులు కట్టాలని చెప్పి తండ్రి ఖాతా నుంచి హర్షవర్ధన్‌రెడ్డి ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇదే విషయం వాళ్ల అమ్మ విజయలక్ష్మికి చెప్పడంతో ఆమె ఖాతాలో ఉన్న రూ.42.50లక్షలను విత్ డ్రా చేసి ఇంట్లో ఉంచింది. కుమారుడు ఇంట్లో ఉన్న డబ్బులను తల్లికి తెలియకుండా తన అకౌంట్లో పలుమార్లు డిపాజిట్ చేసుకున్నాడు. గ్రామంలో తెలిసిన వ్యక్తి దగ్గర రూ.10లక్షల అప్పు చేసి తన ఖాతాలో జమ చేసుకున్నాడు.
కొనుగోలు చేసిన భూమికి మిగతా రూ.50లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని తల్లిదండ్రులు కుమారుని అడుగగా అసలు విషయం బయటపడింది. వారం రోజులుగా ఆన్లైన్ గేమ్ కింగ్ 567 క్యాసినో ఆడి రూ.92లక్షలు పొగొట్టుకున్నాడు. తన ఖాతాలో రూ.92లక్షలు పోయిన విషయం గమనించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అధికారులు సైబర్ నేరస్థులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.