Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో విజిలెన్స్ కమిషన్ ఇచ్చే నివేదికలు బుట్టదాఖలు అవుతున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి తెలిపారు. సుపరిపాలన వారోత్సవాల సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని ఫ్యాప్సీ హాలులో 'ప్రభుత్వ పాలన గ్రామాల దిశగా' అనే అంశంపై వర్క్ షాపు నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందనీ, ప్రజలకు నిర్ణయాలు తెలియకుండా జీవోలను కూడా వెబ్సైట్లో పెట్టడం లేదని తెలిపారు. పాలనకు కావలసినంత మంది అధికారులున్నా వారిని పక్కన పెట్టి ముఖ్యమైన శాఖలని ఒకరిద్దరు అధికారులు అదనపు బాధ్యతలతో నడుస్తుండటంతో పాలన కుంటుపడుతుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదికలు తొక్కిపెట్టారనీ, దీంతో పంచాయతీలకు, మున్సిపాల్టీలకు నిధుల కొరత ఏర్పడిందని చెప్పారు. అవినీతిపై డేగ కన్ను వేసే విజిలెన్స్ కమిషన్ నివేదికలు అన్నీ బుట్ట దాఖలు చేశారన్నారు.