Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగంలోకి డిగ్గి రాజా
- రాయబారం నడిపిన మహేష్, కోదండరెడ్డి
- మాణిక్కం ఠాగూర్‌కు చెక్?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ సీనియర్లపై అధిష్టానం సీరియస్ అయింది. నూతన కార్యవర్గ కూర్పుపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురాకుండా మీడియాకెక్కడం పట్ల గుర్రుగా ఉన్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టేందుకు పార్టీ సీనియర్ నేత ట్రబుల్ షూటర్ దిగ్విజరుసింగ్ (డిగ్గిరాజా)ను రంగంలోకి దించింది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆయన ఫోన్ చేసి అధిష్ఠానం చేసిన సూచనలను తెలిపారు. దిగ్విజరు సూచనతో సీనియర్లు వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ఆయన స్పందనను స్వాగతిస్తున్నామని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు రెండు రోజుల్లో దిగ్విజరు రాష్ట్రానికి రానున్నట్టు సమాచారం. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఫోన్ చేశారు. సీనియర్ల సమస్యలు పరిష్కరిస్తామనీ, సమస్యను జఠిలం చేయొద్దని సూచించారు. సమస్యలపై దిగ్విజరుసింగ్తో చర్చించాలని ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో గొడవలొద్దనీ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భట్టికి ఖర్గే సర్ది చెప్పినట్టు తెలిపారు. మరోవైపు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డి మంగళవారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలు, అధిష్టానం ఆలోచనను వారికి వివరించారు. దీంతో ఆయన మెత్తబడినట్టు కనిపిస్తున్నది. వలస నేతలంటే తమకు గౌరవం ఉందని చెప్పారు. ఇటీవల పార్టీలో చేరిన వారికి ప్రధాన కార్యదర్శి పదవులు ఇచ్చారనీ, ఆ విషయంలో కొంత మనస్థాపం చెందినట్టు తెలిపారు. దీంతో సమస్య పరిష్కారానికి ముఖ్యనేతలతో మాట్లాడారు. సీనియర్లకు సంబంధించిన సమస్యలపై కూర్చొని చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు.
సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు : మల్లు రవి
కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పార్టీ విస్తృత సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి స్పష్టంగా ప్రకటించారన్నారు. టీపీసీసీ చీఫ్ ఆదేశాలను, నాయకులు, క్యాడర్ తు.చ. తప్పకుండా పాటించాలని సూచించారు.