Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపునకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ పలు ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను హైకోర్టు కొట్టేస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్(ఏఐసీటీఈ) పర్మిషన్ ఇచ్చిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా కొత్త కోర్సులు ప్రారంభించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. అదే విధంగా సీట్ల పెంపు కూడా సాధ్యం కాదంటూ తీర్పు చెప్పింది. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా రాష్ట్రం అనుమతి ఇవ్వడం లేదంటూ పలు కాలేజీలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం కొట్టేస్తూ తీర్పు చెప్పింది. సీట్లు పెంపు, కొత్త కోర్సులను ప్రారంభిస్తే పెరిగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని, అందుకే ఏఐసీటీఈ పర్మిషన్ ఇచ్చినా వాటికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం లేదంటూ పిటిషనర్లు చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కాలేజీల్లో ఉన్న డిమాండ్, ఆర్థిక అవసరాలు, ఇతర కారణాలన్నింటినీ బేరీజు వేసుకుని... సంబంధిత అనుమతులపై ప్రభుత్వం తగు నిర్ణయ తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఏఐసీటీఈ అనుమతిని ఆమోదించాలంటూ సాంకేతిక విద్యా శాఖ చేసిన ప్రతిపాదనను విద్యా శాఖ తిరస్కరించిందని తెలిపింది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు ఉంటాయని తెలిపింది.
పంటల నష్టంపై అంచనా వేయండి
వర్షం, వరదల కారణంగా నష్టపోయిన పంటలకు సంబంధించిన నష్టాన్ని రైతుల వారీగా అంచనా వేయాలని ఆదేశిస్తూ హైకోర్టు జస్టిస్ కె.లలిత ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేశారు. గత జులైలో వర్షాలు, వరదలకు నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదంటూ ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం వద్దూర్కు చెందిన గాదె ఉపేందర్ సహా పలువురు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. పంటలకు తీరని నష్టం జరిగిందనీ, ఆ నష్టంపై అధ్యయనం చేయలేదంటూ పిటిషన్లను వాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టంపై అంచనా వేశాయనీ, అయితే రైతు వారీగా నష్టం అంచనా వేయలేదని ప్రభుత్వం తెలిపింది. పంట నష్ట గణన చేపట్టాలంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. నివేదికను ఈనెల 26న నిర్వహించే విచారణ సమయంలో అందజేయాలని కలెక్టర్‌కు ఈ సందర్భంగా కోర్టు సూచించింది.