Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలోనూ అమలు చేస్తాం: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-హయత్‌నగర్
దేశ వ్యాప్తంగా మద్యం నిషేధాన్ని ప్రకటిస్తే తెలంగాణలో కూడా అమలు చేస్తామని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో భారీ మొత్తంలో పట్టుకున్న నకిలీ మద్యం విషయంలో మంగళవారం హైదరాబాద్ హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు సరఫరా అవుతున్న నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు చౌటుప్పల్‌లో పట్టుకున్నారని.. వారిని అభినందిస్తున్నట్టు చెప్పారు. దాదాపు రూ.2.5 కోట్ల విలువైన మద్యాన్ని అధికారులు సీజ్ చేశారన్నారు. తెలంగాణ బ్రాండ్ల పేరుతో ఒడిశాలోని కటక్ జిల్లా తంగి పోలీస్ స్టేషన్ పరిధిలో గల అభయ్‌పూర్ అటవీ ప్రాంతంలో కల్తీ మద్యం తయారీ చేస్తున్నారన్నారు. ఇక్కడ తీగ లాగితే.. ఒడిశాలో డొంక కదిలిందన్నారు. పక్క రాష్ట్రమైనా.. సొంత రాష్ట్రమైనా నకిలీ మద్యం తయారు చేస్తే ఎట్టి పరిస్థి తుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చ రించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దని అధికరులకు సూచించారు. ఎక్సైజ్ అధికారుల వద్ద ఆయుధాలు ఉండవని, అయినా ప్రాణానికి తెగించి సీఎం ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు ఏడాదిలోగా గ్రామాల్లో గుడుంబాను పూర్తిగా అరికట్టారని వివరించారు.
ఇక ఈ ఘటనలో ఇప్పటి వరకు ప్రధాన నిందితులు బింగి బాలరాజు గౌడ్, అన్నేపల్లి కొండల్ రెడ్డి, అనుచరుడు పోరండ్ల సంజయ్ కుమార్, గునేటి గోపికృష్ణ, ఒడిశాకు చెందిన రంజిత్ సమాల్‌తో కలిపి మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారని, మిగతావారిని త్వరలోనే పట్టుకుంటారని తెలిపారు. ఇప్పటికే అనుమానం వచ్చిన నారాయణగూడలోని ఓ మద్యం దుకాణం లైసెన్స్ కూడా రద్దు చేయించామని తెలిపారు. ఇంకా ఎవరైనా అలాంటి వారు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. గతంలో ఇలాంటి పనులు చేసే మాఫియాలు చేస్తుండేవని, కానీ తెలంగాణ వచ్చాక పేకాట, గుడుంబా, అక్రమ మద్యం సరఫరాపై ఉక్కుపాదం మోపడంతో ఆగిపోయిందని చెప్పారు. సమావేశంలో ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఏ. చంద్రయ్య, ఎక్సైజ్ అధికారులు టి.రవీందర్ రావు, డి. అరుణ్ కుమార్, సూర్య ప్రకాష్ రావు, బి.హనుమంతరావు, జీవన్ కిరణ్, ఇబ్రహీంపట్నం సీఐ శ్రీనివాస్ రెడ్డి, కల్పన, రామకష్ణ, పి.శ్రీధర్‌రావు, జి.శ్రీనివాసరావు, చిరంజీవి తదితరులు ఉన్నారు.