Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రికి ఎంపీల వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో దక్షిణాది రాష్ట్రాల చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. వారికి సరైన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం పార్లమెంట్లో నామా నేతత్వంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపీల బందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎంపీలు సుమలత అంబరీష్, ఎల్ హన్మంతయ్య, శాంతా కుమారి, ఎ. గణేశమూర్తి, పి. స్వస్తి సుందరంచియా(ఒరిస్సా)తోపాటు చెరుకు రైతు నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ చెరుకు రైతులకు ఎఫ్ఆర్పీ రేటు నిర్ణయించే విషయంలో దక్షిణ భారత రాష్ట్రాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. చెరుకు రికవరీ రేటు 10.25కు పెంచడంతో దక్షిణాది రాష్ట్రాల రైతులు దిగుబడి తగ్గి, తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని 8.5 శాతనికి తగ్గించాలని కోరారు. దిగుబడి తక్కువగా ఉండడం వల్ల దక్షిణాది రాష్ట్రాల చెరుకు రైతులు రూ.525 కోట్ల మేర నష్టపోతున్నారని అన్నారు. రికవరీ పద్ధతిలో కాకుండా దేశ వ్యాప్తంగా ప్రతి టన్నుకు ధర నిర్ణయించి రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరారు. ఈ ఏడాదిలో క్వింటాలుకు రూ.305గా నిర్ణయించిన ఎఫ్ఆర్పీ ధరను సమీక్షించి,దానిని రూ.350కు పెంచాలని డిమాండ్ చేశారు. చెరుకు కోత, పెరిగిన రవాణా ఖర్చు, ఎరువుల ధర ఎస్ఆర్పీ పెంపునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. షుగర్ కంట్రోల్ చట్టాన్ని సవరించాలనీ, భారీ వర్షాలు, వానలు, వరదల వల్ల చెరుకు దెబ్బతింటుందనీ, వంటల బీమా పథకాన్ని అమలు చేయడం ద్వారా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులతోపాటు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షులు కోటపాటి నరసింహంనాయుడు, ప్రధాన కార్యదర్శి పీకే దైవ శిగామని ఉన్నారు. అంతకు ముందు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి భగవంత్ కుమార్ కుభాను కూడా కలిసి వినతిపత్రం సమర్పించారు.