Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెపోటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మరణం
నవతెలంగాణ-మట్టెవాడ
పోలీస్ ఈవెంట్స్‌లో గెలుపొంది పోలీస్ నౌకరీ చేజిక్కించుకోవాలనుకున్న వ్యక్తి పరుగుపందెంలో గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ మృతిచెందాడు. ములుగు జిల్లా పందికుంట శివారులోని శివతాండకు చెందిన బానోతు రాజేంద్ర (27) శనివారం హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ మైదానంలో జరిగిన పోలీస్ నియామకంలో భాగంగా దేహదారుల పరీక్ష 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు. పరుగు పందెంలో పాల్గొన్న వెంటనే మైదానంలో కార్డియాక్ అరెస్టు రావడంతో హుటాహుటిన పోలీసులు 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న బాధితుడిని అదేరోజు వరంగల్ సీపీ రంగనాథ్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. కోమాలోకి వెళ్లిన బాధితుడిని రక్షించాలని వైద్యులు ప్రయత్నించినప్పటికీ మంగళవారం బాధితుడు కోమలోనే మృతిచెందాడు. పోలీస్ ఉద్యోగంతో తిరిగి వస్తాడనుకున్న కొడుకు మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని బాధితుని స్వగ్రామానికి వరంగల్ మట్టెవాడ పోలీసులు తరలించారు. దాంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.