Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం
- ఉప్పల్ చిలుకానగర్‌లో అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు
నవతెలంగాణ- ఉప్పల్
అధికార పార్టీ బీఆర్ఎస్లో నేతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి. సోమవారం మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపించగా.. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. ఉప్పల్ చిలుకానగర్ డివిజన్లో సుమారు రూ.2 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేయడానికి వచ్చిన నగర మేయర్‌ను స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు గో బ్యాక్ అంటూ అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి పనులు ఎలా చేపడుతారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లె నర్సింగరావు, కొంపెల్లి రవీందర్, మేయర్‌ను ప్రశ్నించారు. దాంతో ఎమ్మెల్యే వర్గీయులు, మేయర్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అధికారుల సమాచారం మేరకు తాము శంకుస్థాపనకు ఇక్కడికి వచ్చామని తెలిపారు. అధికారులు.. ఎమ్మెల్యేకు సైతం సమాచారం అందించారని చెప్పారు. ఇప్పటికే పలుసార్లు శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేశారని.. ఎమ్మెల్యే సూచించిన రోజునే శంకుస్థాపనకు వచ్చామని ఆమె వివరించారు. అనంతరం డివిజన్లో అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రేటర్లో పలు డివిజన్లలో డ్రయినేజీ వ్యవస్థను ఆధునికరిస్తున్నామని, అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి అండర్ పాస్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ, ఉప కమిషనర్ అరుణకుమారి, ఈఈ నాగేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బన్నాల ప్రవీణ్, కొండల్ రెడ్డి, కొక్కొండ జగన్ తదితరులు పాల్గొన్నారు.