Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్‌రెడ్డిని విచారించిన ఈడీ
- ఆర్థిక మూలాల పైనే ప్రధాన దృష్టి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని ఈడీ అధికారులు రెండో రోజు మంగళవారం సుదీర్ఘంగా విచారించారు. మధ్నాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విచారణ కొనసాగింది. సోమవారం ఆయనను దాదాపు ఆరుగంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. కాగా, రెండో రోజు ఉదయం 10.30 గంటలకు ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సిన రోహిత్‌రెడ్డి మధ్యాహ్నం 2.40 గంటలకు లంచ్ సమయం తర్వాత ఈడీ కార్యాలయానికి వచ్చారు. అంతకముందు ఆయన ఉదయం 10 గంటల నుండి తన ఆడిటర్లతో సమావేశమయ్యారు. వారితో చర్చించాక తన బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆడిట్ రిపోర్ట్లు, బ్యాంకు ఖాతాల్లో వివరాలు, తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలతో రోహిత్‌రెడ్డి విచారణకు హాజరైనట్టు తెలిసింది. అందుకే అంత సమయం పట్టినట్టు ఈడీ అధికారులకు తెలిపినట్టు సమాచారం. రోహిత్‌రెడ్డికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, కంపెనీలలో పెట్టుబడులు మొదలైన వివరాలను ఎదురుగా ఉంచుకొని ఈడీ అధికారులు ఎమ్మెల్యేను ప్రశ్నించినట్టు తెలిసింది. సాయంత్రం కొద్దిసేపు టీ విరామం ఇచ్చిన తర్వాత ఈడీ అధికారుల బృందం రోహిత్‌రెడ్డిపై ప్రశ్నల వర్షాన్ని కొనసాగించినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా, ఎమ్మెల్యేకు సంబంధించిన ఆర్థిక మూలాలు, పెట్టిన పెట్టుబడులు, పొందిన లాభాలు, లాభాలు ఆర్జించడానికి అనుసరించిన మార్గాల పైనే ఎక్కువగా ఈడీ అధికారుల ప్రశ్నలు సాగినట్టుగా తెలుస్తున్నది. అలాగే, బ్యాంకు ఖాతాల్లో కొన్ని అనుమానిత అకౌంట్లకు సంబంధించి కూడా రోహిత్‌రెడ్డిని క్షుణ్ణంగా విచారించినట్టు తెలుస్తున్నది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పైనే
ఎక్కువగా విచారించారు : రోహిత్‌రెడ్డి
దాదాపు 8 గంటల పాటు ఈడీ విచారణ అనంతరం వెలుపలికి వచ్చిన రోహిత్‌రెడ్డి.. తనను ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మాత్రమే విచారణకు పిలిచినట్టు ఈడీ అధికారులు తనకు కారణం తెలిపారని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అర్థరాత్రి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. బీజేపీకి చెందిన కొందరు స్వాములు తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డారంటూ తాను ఫిర్యాదు చేస్తేవారిని గాక తనను ఈడీ పిలిపించి విచారించడం ఏమిటో అర్థం కావటం లేదని ఆయన వాపోయారు. మొయినాబాద్ కేసుకు సంబంధించి మిమ్మల్ని విచారిస్తున్నామని వారు(ఈడీ) చెప్పటం ఆశ్చర్యం వేసిందని అన్నారు. అంతేగాక, తనకు సంబంధించి, తన కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలను వారు పూర్తిగా అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు. అంతేగాక, తాను చేస్తున్న వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల గురించి కూడా విచారణ జరిపారని రోహిత్‌రెడ్డి అన్నారు. ముఖ్యంగా, తాను ఎన్నిసార్లు విదేశాలకు వచ్చింది, ఎందుకు వెళ్లింది అనే అంశంపై కూడా ఈడీ అధికారులు విచారించారని రోహిత్‌రెడ్డి విచారించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వీరు విచారింటం ఏమిటో, తనది, తన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు సేకరించటం ఏమిటో ఏమాత్రమూ అర్థం కావటం లేదని అన్నారు. ఇంత విచారించాకా తిరిగి ఈనెల 27న రావాలని ఈడీ అధికారులు కోరారని, తాను తప్పకుండా వస్తానని తెలిపి రోహిత్‌రెడ్డి కారెక్కి వెళ్లిపోయారు.