Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం
- 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ జీవోల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం
- ఉద్యోగ, సామాజిక భద్రతలేని స్కీమ్ వర్కర్లు, అసంఘటిత కార్మికులు
- ఆర్థిక దోపిడీ, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు
- రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్ కర్తవ్యాల రూపకల్పన
- నవతెలంగాణతో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి సంఘటిత పోరాటాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ దిశగా సీఐటీయూ రాష్ట్ర 4వ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందిస్తాం' అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు నవతెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల ప్రభావం ఎలా ఉంది?
మోడీ అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాల్ని మరింత వేగవంతం చేసింది. ఫలితంగా పర్మినెంట్ కార్మికుల సంఖ్య తగ్గింది. గౌరవప్రదమైన ఉద్యోగం లభించే పరిస్థితి లేదు. అప్రంటిషిప్ విధానం, పిక్స్డ్ టర్మ్ నియామకం, నీమ్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులనే రూపాల్లో ఉత్పత్తి రంగంలో నియామకాలు జరుగుతున్నాయి. ఫ్లోర్ లెవల్ మినిమం వేజ్ రోజుకు రూ.178గా నిర్ణయించారు. దీని వల్ల ఒక కుటుంబం నెలకు రూ.5 వేల జీతంలో బతకాలంటే ఎంత దుర్బరమైన జీవితం గడుపుతారో అర్ధమవుతుంది. సెంట్రల్ డ్రేట్ యూనియన్లను పట్టించుకోవడం లేదు. ఇటీవల బడ్జెట్ రూపకల్పిన సందర్భంగా ట్రేడ్ యూనియన్లను ఆన్లైన్లో సంప్రదించి కేవలం ఒక యూనియన్‌కు రెండు నిమిషాలు సమయం కేటాయించడమంటే ప్రభుత్వానికి కార్మికుల సమస్యలంటే ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్పు చేశారు. వీటిని వ్యతిరేకిస్తూ అఖిల భారత స్థాయిలో ట్రేడ్ యూనియన్లు సమ్మె పోరాటం చేశాయి. మహిళా కార్మికులకున్న హక్కులు హరించబడుతున్నాయి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, భద్రత కోసం మహిళా కార్మికుల్ని చైతన్యం చేసి సీఐటీయూ పోరాటాలు చేస్తోంది.
ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న తీరును వివరించండి
బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేస్తోంది. హెచ్ఏఎల్తో సహా రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు చేసే సంస్థలన్నిటినీ ప్రయివేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెడుతున్నారు. ఖనిజాలు, పోర్టులు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయల కల్పన రంగాన్ని కూడా ప్రయివేట్ వ్యక్తుల లాభాల కోసం ప్రయివేటీకరిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఎల్ఐసీ, రైల్వే, బ్యాంకింగ్ వంటి సంస్థల్ని కూడా ప్రయివేటీకరించడం వల్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతినడమే కాకుండా ప్రజల సామాజిక భద్రతకు కూడా ఉప్పు వాటిల్లనుంది.
బీజేపీ ప్రభుత్వ మతోన్మాద ప్రమాదం కార్మిక వర్గంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది
ప్రయివేటీకరణ, సరళీకరణ విధానాల వల్ల కార్మిక వర్గంలో పెద్ద అసంతృప్తి నెలకొంది. గౌరవప్రదమైన ఉద్యోగాలు లభించకపోవడం, ఉన్న ఉద్యోగులు కోల్పోవడమే కాకుండా అధిక ధరల ప్రభావం కార్మిక వర్గంపై తీవ్రంగా ఉంది. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక వర్గంలో చీలిక తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపాదికన సెంటిమెంట్‌ను రెచ్చగొడుతోంది. మతోన్మాద పోకడల్ని పెంచి పోషిస్తోంది. అందుకే కార్మికులు సరళీకరణ, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే మరో పక్క మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది.
కార్మిక, కర్షక ఐక్యత దిశగా సీఐటీయూ చేస్తున్న కృషి ఎలా ఉంది?
దేశంలో పేదలకు న్యాయం జరగాలన్నా, దోపిడీ నుంచి విముక్తి జరగాలన్నా కార్మిక, కర్షక ఐక్యత ముఖ్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ రైతుల పోరాటాల్ని బలపర్చింది. మద్దతుగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం వైఖరిని సీఐటీయూ ఎండగడుతోంది. వ్యవసాయ కార్మికులకు పని గ్యారంటీ, వేతనాల పెంపు కోసం జరిగే పోరాటాల్లో సీఐటీయూ కలిసి పని చేస్తోంది. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 2023 ఏప్రిల్ 5న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు రాష్ట్రంలో సీఐటీయూ కృషి చేస్తోంది.
రాష్ట్ర మహాసభల ప్రాధాన్యతను వివరించండి
సిద్దిపేట పట్టణంలో తొలిసారిగా జరగనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం ఆహ్వాన సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర నాయకులకు అవసరమైన ఏర్పాట్లను సిద్దిపేటలోని సీఐటీయూ అనుబంధ యూనియన్లు పూర్తి చేశాయి. 33 జిల్లాల నుంచి 700 మంది ప్రతినిధులు, పరిశీలకులు హాజరుకానున్న ఈ మహాసభల ప్రారంభానికి సీఐటీయూ జాతీయ అధ్యక్ష, కార్యదర్శి హేమలత, తపన్‌సేన్, ఉపాధ్యక్షులు సాయిబాబు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ నెల 23న జరిగే బహిరంగ సభకు కేరళ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివన్కుట్టి హాజరవుతారని తెలిపారు.