Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యథేచ్ఛగా నిషేధిత పురుగుమందుల అమ్మకాలు
నవతెలంగాణ-గణపురం
'పున్న స్వామి' ఆయిల్ పెస్టిసైడ్ మందులను ప్రభుత్వం నిషేధించినప్పటికీ రైతులు ఎగబడి కొంటుండటంతో అవసరాలను ఆసరా చేసుకున్న కంపెనీ యథేచ్చగా అమ్మకాలు చేపడుతోంది. జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత 'పున్న స్వామి' పురుగు మందులు తెప్పించి అమ్మకాలు చేపడు తున్నాడు. ఈ తతంగం కొన్నేండ్లుగా కొనసాగి స్తున్నాడు. మేడ్చల్లో తయారైన ఈ మందులను అతని వ్యక్తిగత కారులో గాంధీనగర్ గ్రామానికి తెప్పిస్తాడు. అప్పటికే మందులు కావాల్సిన వారికి ఆ వ్యక్తి ఫోన్ చేసి తమ ఇంట్లో ఉండాలని చెబుతాడు. మందుల పెట్టెలు రావడంతో అధిక ధరకు విక్రయించి అరగంటలో వచ్చిన మందులు అమ్మేస్తాడు. ఇలా కొన్నేండ్లుగా యథేచ్ఛగా దందా సాగిస్తున్నాడని గాంధీనగర్ గ్రామస్తులు తెలిపారు. పున్న స్వామి మందులను నర్సంపేట, భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, ములుగు, రేగొండ, గణపురం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని మండలాల రైతులు కొనుగోలు చేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకున్న సదరు వ్యక్తి అధిక మొత్తంలో నిషేధిత పున్న స్వామి పురుగుమందుల కాటన్ పెట్టెలు తెప్పించి రైతులకు విక్రయిస్తున్నాడు. పున్న స్వామి కంపెనీలో 25 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయని, వాటిలో రెండు రకాల మందులు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రభుత్వం ఆ మందులను నిషేధించింది. నిషేధించిన మందులు పంటలకు బాగా పనిచేస్తున్నాయనే ఉద్దేశంతో రైతులు వాటిని అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. కాగా ఆ మందులు సోమవారం గాంధీనగర్ గ్రామానికి చేరుకోగా అప్పటికే అక్కడికి రైతులు భారీ సంఖ్యలో చేరుకోగా సదరు వ్యక్తి అరగంటలో పురుగుమందుల కాటన్లు అమ్మేసి ప్రదేశాన్ని ఖాళీ చేయించడం గమనార్హం.
విచారణ చేపడతాం : ఏవో ఐలయ్య, గణపురం
మండలంలో నిషేధిత మందుల అమ్మకాలపై నిరంతరం నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నాం. కొందరు రైతులు కావాలనే పున్న స్వామి నిషేధిత మందులు తెచ్చుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. నిషేధిత మందులు వాడకుండా రైతులకు అవగాహన కల్పిస్తాం. పున్న స్మామి నిషేధిత పురుగుమందుల అమ్మకాలపై విచారణ చేపట్టి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం.
అతన్ని అరెస్టు చేయాలి :సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
గాంధీనగర్ కేంద్రంగా ప్రభుత్వ నిషేధిత మందులు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేయాలి. రైతుల అవసరాలను ఆసరా చేసుకున్న సదరు వ్యక్తి ఆయన ఇంట్లోకి మందులను తీసుకొచ్చి ఏ విధంగా అమ్ముతాడు. మందులు పెట్టిన ఇంటిని సీజ్ చేసి, సదరు వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.