Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికవర్గం తిప్పికొట్టాలి : సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వర్రావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- సిద్ధిపేట
రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దేశాన్ని మనువాద రాజ్యంగా మార్చే పనిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందనీ, దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందని సీఐటీయూ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వర్రావు నొక్కి చెప్పారు. బుధవారం సిద్ధిపేటలో (మల్లుస్వరాజ్యం నగర్- సున్నంరాజయ్య ప్రాంగణం)లో ప్రారంభమైన సీఐటీయూ రాష్ట్ర మహాసభలనుద్దేశించి ఆయన సౌహార్ద సందేశమిచ్చారు. ఆర్ఎస్ఎస్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు వీలుగా తవేగంగా పావులు కదుపుతున్నదని చెప్పారు. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అంటూ ప్రజలను మభ్యపెట్టేలా బీజేపీ ముందుకు సాగుతున్నదని విమర్శించారు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ కార్మికులకు చాతాండత హామీలు ఇచ్చారనీ, ఆచరణలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులను దారిమళ్లించి కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయన్నారు. ఏపీలోని పోర్టులను అంబానీ, ఆదానీలకు అప్పగిస్తుంటే సీఎం జగన్ కండ్లప్పగించి చూస్తున్నారు తప్ప ఏమీ మాట్లాడటం లేదన్నారు. దానికి వ్యతిరేకంగా సీఐటీయూగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హౌదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టంగా మాట్లాడుతున్నా జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం హక్కుల కంటే సొంత ప్రయోజనాలే మిన్న అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, ఎస్వీ.రమ, భూపాల్, మధు, రాగుల రమేశ్, బీరం మల్లేశ్, ఏజే రమేశ్, త్రివేణి, యాదానాయక్, చంద్రశేఖర్, ఎం.వెంకటేశ్, ఉపాధ్యక్షులు పి.రాజారావు, ఎస్.వీరయ్య, పి.జయలక్ష్మి, మల్లిఖార్జున్, కల్యాణం వెంకటేశ్వర్లు, టి.వీరారెడ్డి, కోటంరాజు, వీఎస్.రావు, పద్మశ్రీ, ముత్యంరావు, మందా నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.