Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 31న రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేస్తున్నారు. మరోవైపు, సీఐడీ డీజీపీ గోవింద్ సింగ్ గతంలో రిటైర్ కాగా మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ప్రమోద్ కుమార్, ఇంటిలిజెన్స్ డీఐజీ శివకుమార్‌లు కూడా పదవీ విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ పోస్టుతో పాటు సీఐడీ డీజీ, ఇంటెలిజెన్స్ డీఐజీ, నగర స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి. కాగా, ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్‌ను డీజీపీగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆ పోస్టు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ దాదాపు ఆరు ఏండ్ల నుంచి అదే పోస్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనను కూడా మరో కీలక పోస్టుకు బదిలీ చేసే అవకాశం ఉన్నదని తెలిసింది. పైన ఏర్పడుతున్న పోస్టుల ఖాళీలతో పాటు మరికొన్ని జిల్లాల ఎస్పీల బదిలీలు కూడా జరిపేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల చివరివారంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగను న్నట్టు సమాచారం. ఏయే ఐపీఎస్ అధికారిని ఏ పోస్టులో నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయో అనే ఒక నివేదికను డీజీపీ కార్యాలయం ప్రగతి భవన్‌కు పంపించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.