Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవాదుల ఆడిట్ ప్రాంతంలో రైతుల ఆందోళన
- మినీక్రషర్ ఏర్పాటు చేయొద్దని పురుగుమందు డబ్బాలతో నిరసన
- అధికారులను అడ్డుకున్న రైతులు
నవతెలంగాణ-శాయంపేట
దేవాదుల మూడో విడత సొరంగం పనుల కోసం రైతుల నుంచి వ్యవసాయ భూములను లీజుకు తీసుకొని పనులు పూర్తికాగానే తిరిగి భూములను అప్పగిస్తామని చెప్పి తీరా పనులు పూర్తయినా అప్పగించలేదని, పైగా అక్కడే మినీ క్రషర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మైలారం గ్రామశివారులోని సొరంగం ప్రాంతాన్ని పరిశీలించి తిరిగి వెళుతున్న ఇరిగేషన్ అధికారుల వాహనాన్ని రైతులు అడ్డుకొని తమ భూములు అప్పగించాలని డిమాండ్ చేస్తూ పురుగుమందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు.
భూములను అప్పగించని పక్షంలో 18 కుటుంబాల రైతులందరం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఇరిగేషన్ డీఈ రవీందర్ హామీతో రైతులు శాంతించి వెళ్లిపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామ శివారులో దేవాదుల మూడో విడత సొరంగం పనుల కోసం 18 మంది రైతుల నుంచి 27-30 ఎకరాల భూమిని కోస్టల్ మెగా కంపెనీ లీజ్‌కు తీసుకుని ఆ స్థలంలో ఆడిట్ పాయింట్ ఏర్పాటుచేసి పనులు పూర్తి చేసింది. సొరంగం పనుల్లో వచ్చిన పెద్ద పెద్ద బండ రాళ్లు, మెటీరియల్‌ను ఆ ప్రాంతంలోనే నిలువ చేశారు.
పనులు పూర్తయినప్పటికీ తిరిగి రైతులకు భూమిని అప్పగించలేదు. ఇటీవల కాలంలో రైతులు తమ భూములు తమకు అప్పగించాలని ఆందోళనలు చేపట్టడంతోపాటు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 18-27 ఎకరాల పట్టా భూమితోపాటు 5 ఎకరాల అసైన్డ్ భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ స్థలంలో నిలువ చేసిన బండరాళ్లను, మెటీరియల్‌ను తొలగించడానికి హైదరాబాద్‌కు చెందిన ప్రయివేటు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. దాంతో సంబంధిత కాంట్రాక్టర్ ఆ ప్రాంతంలో మినీ క్రషర్ ఏర్పాటు చేయడానికి బుధవారం రాత్రి సామగ్రిని దింపాడు. విషయం తెలుసుకున్న రైతులు అరకిల్ల విజరు, సమ్మయ్య, సామ్యేల్, జక్కుల శ్రీనివాస్, పల్లెబోయిన పోషయ్య, సమ్మయ్య, సారయ్య, జంపయ్య, అల్లం రమేష్, కుమారస్వామి, దూదిపాల మల్లారెడ్డి, మామిడిపెళ్లి అయిలుమల్లు, నూనె సాంబయ్య, గోగుల శ్రీలత రెడ్డి గురువారం ఉదయమే అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి తిరిగి వెళుతున్న ఇరిగేషన్ అధికారుల వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు.
సమస్య పరిష్కరించేంతవరకు వెళ్ళనివ్వమని పురుగుల మందు డబ్బాలు పట్టుకొని రైతులు ఆందోళన చేపట్టారు. దాంతో స్పందించిన డీఈ రవీందర్ మాట్లాడుతూ.. భూములు కోల్పోయిన రైతులు సమస్యపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి వారి ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. రైతులు కూడా తమ పట్టా భూమిని 18-27 ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించినట్టు అగ్రిమెంట్లు ఉన్నాయని తెలిపారు. రైతుల ఆందోళన మేరకు పది రోజులపాటు ఆడిట్ స్థలంలో ఎలాంటి పనులు చేపట్టమని హామీ ఇవ్వడమే కాక, పనులు చేపట్టడానికి వచ్చిన రెండు జేసీబీలను అక్కడి నుంచి పంపించి వేయడంతో రైతులు శాంతించి అధికారులను పంపించారు.