Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి కష్టాలు పోయేదెప్పుడు?
- దివ్యాంగులనే పేరు మార్పుతో సరిపెట్టిన కేంద్రం
- 2016 ఆర్పీడీ చట్టానికి తూట్లు
నవతెలంగాణ : ఎలా పుట్టాలో.. ఏ కులంలో పుట్టాలో మనం నిర్ణయించలేం. అదో ప్రకృతి నియమం. అవయవ లోపాలతో పుట్టడం కూడా మన తప్పు కాదు. కానీ శిక్ష పడుతుంది మాత్రం వికలాంగులకే. ఏదో సాధించాలనే తపన, అందరితో సమానంగా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక వారిలో బలంగా ఉంటుంది. కానీ పరిస్థితులు మాత్రం ఆ అభాగ్యులకు అనుకూలించవు. పైగా అవహేళనలు. ఇలాంటి వారికి చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. వారిలోని ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టాల్సింది సర్కార్లే. వారి ఆశయానికి ఊతమివ్వాల్సింది కూడా ప్రభుత్వాలే. కానీ పాలకులు ఆ పని చేయడం లేదు. శారీరక లోపాలతో పుట్టి తప్పు తమది కాకపోయినా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వికలాంగుల కష్టాలు పోయేదెప్పుడు? కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులుగా పిలవొద్దనీ, వారిని దివ్యాంగులుగా (భగవంతుడి బిడ్డలు) పిలవాలని నామకరణం చేశారు. అంటే..ఇక నుంచి ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు..అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడన్న పద్దతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. పైగా 2016 వికలాంగుల పరిరక్షణ చట్టానికి సవరణ చేసేందుకు ప్రయత్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ..వారికి రావాల్సిన వాటాను కేటాయించటంలో విఫలమయింది.
సమాజంలో స్త్రీలు, పురుషులు, ట్రాన్స్జెండర్లలాగానే.. వికలాంగులు కూడా ఒక ప్రత్యేకమైనవారుగా ఉన్నారు. వారికీ తగిన పద్దతిలో సౌకర్యాలు, సౌలభ్యాలు కల్పించటం అవసరం. శారీరక, మానసిక అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని వారి అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. తమపై ''అయ్యో! పాపం'' అనే భావం కంటే చేతనైతే తమ హక్కులకై పోరాడటానికి మద్దతివ్వండంటూ వికలాంగుల సంఘాలు కోరుతున్నాయి.
21 రకాల వైకల్యాలతో ఇక్కట్లు..
అంధులు, చెవిటి, మూగ, మానసిక వైకల్యం శారీరక వైకల్యం... ఇలా 21 రకాల వైకల్యాలతో వికలాంగులు బాధపడుతున్నారు. రకరకాల సమస్యలతో ఉన్న వీరి జనాభా దేశవ్యాప్తంగా రెండున్నర కోట్లు, రాష్ట్రంలో అనదికార లెక్కల ప్రకారం సుమారు 20లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల మందికి పైగా వికలాంగ విద్యార్థులున్నారు. చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, గౌరవంగా బతకాలనే ఆశలతో ఉన్నవారు ఇంకా చాలా మందే ఉంటారు. కాని వీరికోసం అవసరాలకు అనుగుణంగా విద్యాసంస్థలు లేవు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తగిన సౌకర్యాలు లేక అవస్థలు..
రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో సైగలభాష, బ్రెయిలీ లిపి వంటివి అందుబాటులో లేవు. ర్యాంపులు లేవు. ఈ కారణంగా అనేకమంది విద్యార్థులు రాణించలేకపోతున్నారు. ఆర్థిక స్థోమత లేక చాలామంది పాఠశాల స్థాయిలోనే డ్రాప్‌ఔట్ అవుతున్నారు. ఇలాంటి విద్యార్థులు ఇబ్బందుల నుంచి బయట పడాలంటే కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యలో భాగంగా ఏర్పాటు చేయబోతున్న గురుకులాల్లో వీరి అవసరాలకు తగిన రీతిలో వాటి నిర్మాణం చేపట్టాలి.
మహిళా వికలాంగులకు ప్రత్యేక సమస్యలు..
మరో వైపు మహిళా వికలాంగులకు ప్రత్యేక సమస్యలున్నాయి. వీరు ఎక్కువ మంది ఇంటినుండే వివక్షకు గురవుతున్నారు. అన్నీ మంచిగా ఉన్న ఆడపిల్లల్ని చదివించడానికే ముందుకు రాని కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళా వికలాంగుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. పెండ్లి అవుతుందో కాదో అనే ఆందోళనకు గురవుతూ వారు కూడా మానసికంగా కుంగిపోతుంటారు. ఇలాంటి వారికి జీవితంపై భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, కుటుంబ సభ్యులపై ఉంటుంది. అయితే ఎలాంటి ఆదరణకు నోచుకోక కొందరు అనివార్యంగా ట్రాఫిక్ సిగల్స్, దేవాలయాల వద్ద భిక్షగాళ్ళుగా మారుతున్నారు. వీరి జీవితాలు రోడ్లపై మగ్గుతున్నాయి. ఈ కారణంగా దోపిడీదొంగలు, అరాచకుల చేతుల్లో అనేక రకాల దాడులకు, లైంగిక దాడులకు గురవుతున్నారు. దీనికి ప్రభుత్వ నిరాదరణే కారణమన్న విమర్శ తీవ్రంగా ఉంది. ఇకనైనా మహిళా వికలాంగుల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయిలి. డ్వాక్రా గ్రూపులతో సమానంగా వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలి. అర్హులైనవారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలి. అంగన్వాడీ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది.
అడుగడుగునా నిర్లక్ష్యమే..
'పనిచేసే శక్తి ఉన్నా అంగవైకల్యం కారణంగా ఆ శక్తిని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. పని చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వ ఆదరణ లేక కనీస సౌకర్యాలకు నోచుకోవడంలేదు. దీంతో కూలీ పనులు ఇచ్చేవారు కూడా వికలాంగులకు పని ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ప్రయివేటు కార్యాలయాల్లో, విద్యా, వైద్య, వ్యాపార సంస్థల్లో, నిర్మాణ కేంద్రాల్లో, ఇంటిపనుల్లో వీరికి పని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు. కనుక ప్రభుత్వ పథకాల్లో వీరిని పనిలో పెట్టుకోవడానికి అవసరమైన ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి. పనికి ఆహారపథకం, చెట్లు నాటడం, పారిశుద్ధ్యం, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో వాచ్మెన్, అటెండర్ వంటి ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి. వికలాంగులు ఎదుర్కొంటున్న ఇలాంటి అనేక సమస్యలపై ఈ నెల 26నుంచి 28వరకు హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ మహాసభల్లో చర్చిస్తాం. పలు అంశాలపై తీర్మానాలు చేయనున్నాం'. భవిష్యత్‌లో వాటిపై పోరాటాలను నిర్వహిస్తాం.
- ఎం అడివయ్య , ప్రధాన కార్యదర్శి
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ)