Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకోసం వాటిని డిజిటలైజ్ చేయండి : హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- విద్యార్థులందరూ బుక్ ఫెయిర్‌ను సందర్శించాలి
- ఎక్కువ రోజులు పుస్తక ప్రదర్శనను కొనసాగిస్తామంటూ హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పుస్తక సంపదను భావి తరాలకు వారసత్వంగా అందిద్దామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. కాగిత యుగం కనుమరుగు కాబోతోందన్న సంకేతాల నేపథ్యంలో వాటిని ఎంత మేర వీలైతే అంత డిజిటీలీకరణ చేయాలని ఆయన కోరారు. ఆ రూపంలో రేపటి పౌరులకు వాటిని చేరువ చేయాలని అభిలషించారు. గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 35వ జాతీయ పుస్తక మహోత్సవాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ... విద్యార్థులందరికీ పుస్తక ప్రదర్శన సందర్శనకు అవకాశం కల్పించాలని కోరారు. అందుకనుగుణంగా విద్యాశాఖ అధికారులు, ఉన్నత విద్యామండలి అధికారులతో సమన్వయం చేసుకోవాలని భాషా, సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణను ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రంధాలయాల్లో ఏయే పుస్తకాలున్నాయి.. అవిగాక ఏయే పుస్తకాలను అందుబాటులో ఉంచాలనే అంశంపై మేధావుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విద్యాలయాల విద్యార్థులందరూ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సందర్శించాలని శ్రీనివాస్‌గౌడ్ ఈ సందర్భంగా సూచించారు.
ఉమ్మడి రాష్ట్రంలో బుక్ ఫెయిర్ నిర్వహణ కోసం స్థలాన్ని అద్దెకు తీసుకోవడం లాంటి ఎన్నో కష్టాలుండేవని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక పుస్తక ప్రదర్శన కోసం ప్రభుత్వం ఉచితంగా స్థలం కేటాయిస్తున్నదని తెలిపారు. ఈ ప్రదర్శన జనవరి ఒకటితో ముగుస్తుందనీ, ఆ గడువును మరికొన్ని రోజులు పొడిగించాలంటూ ప్రజలు, మేధావుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. ఈ క్రమంలో ఎన్ని రోజులైనా సరే...బుక్ ఫెయిర్ నిర్వహణకు అనుమతినిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టడానికి కూడా పుస్తకాలే కారణమని తెలిపారు. వాటిని చదవటం ద్వారా గొప్ప సంపద కలిగిన తెలంగాణ ప్రాంతం ఎంతో దుస్థితికి చేరిందనే విషయాన్ని ఆయన గ్రహించారని వివరించారు.
కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. గాంధీజీని చరిత్ర నుంచి కనుమరుగు చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని చెప్పారు. ఆయన్ను చంపిన గాడ్సేను మహనీయుడిగా చిత్రీకరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు పుస్తక పఠనం దోహదపడుతుందని వివరించారు. కరోనా కాలంలో సామాజిక మాధ్యమాల్లో అనేక తప్పుడు సమాచారం ప్రజలను గందరగోళానికి గురి చేస్తే, వాస్తవ సమాచారంతో సమాజాన్ని బతికించినవి పత్రికలేనని కొనియాడారు. పుస్తకాలను చదవటం ద్వారా దేశంలో జరిగిన ఉద్యమాలతోపాటు తెలంగాణ లో కొనసాగిన పోరాటాలకు సంబంధించిన చరిత్రను తెలుసు కోవాలని విద్యార్థులకు సూచించారు. పుస్తకాలు చదివితే జ్ఞానమొస్తుందనీ, ఆ జ్ఞానంతో ప్రపంచం అర్థమవుతుందని తెలిపారు.
పుస్తకాలతోనే సమాజ పురోగతి..
ఆర్.సుధాభాస్కర్, నవతెలంగాణ సంపాదకులు
'పుస్తకం చదివితే అది ప్రశ్నించడం నేర్పుతుంది. ప్రశ్నించడం ద్వారా అన్ని నేర్చుకుంటాం. ప్రశ్న లేకుండా సమాజం లేదు. సమాజ పురోగతి లేదు. అందుకే పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకోవాలి. ఉదాహరణకు వర్షం ఎందుకు పడుతుందని ప్రశ్నించుకుంటేనే, తెలుసుకుంటేనే శాస్త్రీయ విజ్ఞాన ప్రచారం జరుగుతుంది. 'నీళ్ళ ద్వారా కలరా వచ్చినట్టు, పుస్తకాల ద్వారా కమ్యూనిజం వస్తుందని కొడవటిగంటి కుటుంబరావు అన్న విషయాన్ని సుధాభాస్కర్ గుర్తుచేశారు. పుస్తకం ప్రశ్నించటం నేర్పాలని, ప్రశ్న ప్రగతికి ప్రస్తానమని చెప్పారు. పుస్తక ప్రదర్శనకు 10 రోజుల పాటు ఉచితంగా స్థలం కేటాయించడం సంతోషం. దీన్ని మరికొద్ది రోజులు పొడిగించాలి. విద్యార్థులు పంచతంత్రం మొదలు అన్ని పుస్తకాలను చదవాలి'
పదాలపై పట్టు సాధించాలి..
కె.శ్రీనివాస్ రెడ్డి, ప్రజాపక్షం సంపాదకులు
'పుస్తకాలను చదవడం ద్వారా లక్షలాది పదాలపై పట్టు సాధించవచ్చు. ప్రపంచ అవకాశాల రీత్యా ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. అదే సమయంలో తెలుగు, ఉర్దూ, హిందీ వంటి భాషలను నిర్లక్ష్యం చేయొద్దు. విద్యార్థి దశ విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి అనువైనది. పలు దేశాల్లో సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ఆయా కొత్త పదాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. ప్రదర్శనను మరికొన్ని రోజులు పొడిగించాలి...'
పుస్తకంతో మంచి భవిష్యత్తు.. తీగుళ్ల కృష్ణమూర్తి, నమస్తే తెలంగాణ సంపాదకులు
'పుస్తకం చదివితే వెంటనే డబ్బు రాకపోవచ్చు. కాని మంచి భవిష్యత్తు ఉంటుంది. బుక్ ఫెయిర్, ప్రదర్శన అనే పదాలు అవి అందిస్తున్న సేవలకు సరిపడినట్టుగా లేదు. పుస్తకాల వేడుక, పుస్తకాల పండుగ, పుస్తకాల జాతర వంటి పేర్లను పరిశీలించి పెట్టాలి...'
అదనపు పుస్తకాలు చదవాలి..కె.శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి సంపాదకులు
'తరగతి పాఠ్య పుస్తకాలతో పాటు అదనపు పుస్తకాలు చదివే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. పుస్తకం చదవడం ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి. అలాంటి వారు వయస్సు మీద పడిన బలంగా ఉంటారు. లక్షల పదాలు అదనంగా తెలిసి ఉంటాయి. చదువుకునేందుకు ప్రచురించిన పుస్తకమే బాగుంటుంది. చదివిన పుస్తకాలపై స్నేహితులతో చర్చించాలి. ఈ తరాన్ని గందరగోళ పరిచే అనేక అంశాలు వచ్చి చేరాయి. సింగపూర్‌లో ప్రతి ఒక్కరూ ఒక పుస్తకం చదవాలనే ఉద్యమం వచ్చింది. అలాంటి ఉద్యమాలు స్థానికంగా కూడా రావాల్సిన అసరముంది. పుస్తకమనేది సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న జ్ఞానరాహిత్య సమస్య నుంచి బయపడేస్తుంది...'
కేసీఆర్ జన్మదినం...పుస్తక పఠన దినోత్సవం : జూలూరు
పుస్తక ప్రియుడైన సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పుస్తక పఠన దినోత్సవంగా నిర్వహిస్తే బాగుంటుందని జూలూరి గౌరీశంకర్ సూచించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన 'తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర' పుస్తకాన్ని బహుకరించి సన్మానించారు.
అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ భాషా, సాంస్కతిక శాఖ స్టాళ్లను అల్లం నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్త దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కోయ చంద్రమోహన్ స్వాగతం పలకగా, కార్యదర్శి శతికాంత్ భారతి వందన సమర్పణ గావించారు. బుక్ పెయిర్ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.