Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ రంగ ఆర్టిజెన్స్కు జేఎల్ఎమ్గా కన్వర్జేషన్ ఇవ్వాలి
- ఆర్టీసీని పరిరక్షించాలి : సీఐటీయూ రాష్ట్ర మహాసభలో పలు తీర్మానాలకు ఆమోదం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అర్హులైన కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర మహాసభ డిమాండ్ చేసింది. సిద్దిపేటలోని మల్లు స్వరాజ్యం నగర్లోని సున్నంరాజయ్య ప్రాంగణంలో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభల్లో గురువారం పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. అర్హులైన కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలనే తీర్మానాన్ని సాగర్ ప్రవేశపెట్టారు.
దీనిని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒకవేళ అలాకాని పక్షంలో ఇండ్ల స్థలాలున్న అందరికీ ఐదు లక్షల రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేసింది. విద్యుత్ శాఖలోని ఆర్టిజెన్స్ను జేఎల్ఎమ్గా కన్వర్జేషన్గా ఇవ్వాలని తీర్మానాన్ని కూడా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మతోన్మాదం దేశానికి ప్రమాదకంగా మారిందనీ, దాన్ని ఎదుర్కొనేందుకుగానూ ప్రజలను చైతన్యం చేయాలనే తీర్మానాన్ని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఏజే రమేశ్ ప్రతిపాదించగా మహాసభ ఆమోదించింది. ఆర్టీసీ పరిరక్షణపై తీర్మానాన్ని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీఎస్రావు ప్రతిపాదించారు. ఆర్టీసీ ఉద్యమం మీద రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిర్భందాన్ని ఎత్తివేయాలని కోరారు. 2017, 2021 సంవత్సరాలకుగానూ పెండింగ్లో ఉన్న రెండు పేస్కేల్స్ను ఆర్టీసీ యాజమాన్యం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రెండు శాతం నిధులను కేటాయించాలని కోరారు. సీసీఎస్, పీఎఫ్ నిధులను ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ తీర్మానానాన్ని మహాసభ ఆమోదించింది. సామాజిక సమస్యలు అనే అంశంపై తీర్మానాన్ని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ప్రతిపాదించగా మహాసభ ఆమోదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సామాజిక వివక్షపై నికరంగా పోరాడాలని పిలుపునిచ్చింది. స్కీంవర్కర్లను కార్మికులుగా గుర్తించాలి..సమస్యలు పరిష్కరించాలి అనే తీర్మానాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి ప్రతిపాదించగా నూర్జహాన్ బలపర్చారు. మహాసభ ఆమోదించింది. సింగరేణిపై మందా నర్సింహారావు తీర్మానాన్ని ప్రతిపాదించారు.